శాతవాహన యూనివర్సిటీ చెట్లు నరికిన చోట మొక్కలు నాటుతాం : రిజిస్ట్రార్ సతీశ్ కుమార్

శాతవాహన యూనివర్సిటీ చెట్లు నరికిన చోట మొక్కలు నాటుతాం : రిజిస్ట్రార్ సతీశ్ కుమార్

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్లో చెట్ల నరికివేతను ఏమాత్రం సహించబోమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పెద్దపల్లి సతీశ్​ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లు నరికినా, కలప తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల యూనివర్సిటీలో చెట్ల నరికివేత, మట్టి తవ్వకాలపై వివాదం, ‘వీ6, వెలుగు’లో ‘క్యాంపస్​ కన్నీరు’ అని వెలువడిన కథనం నేపథ్యంలో గురువారం ఆయన వివరణ ఇచ్చారు. 

కరెంట్​ స్తంభాలు, తీగలకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను ప్రమాదాల నివారణ కోసం మాత్రమే తొలగించేందుకు అనుమతించామని, అయితే సదరు వ్యక్తి కొన్ని చెట్లను అక్రమంగా నరికినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఇప్పటికే అటవీశాఖ ఆఫీసర్లు విచారణ చేపట్టారని తెలిపారు. అభివృద్ధి పనులకే మట్టిని వినియోగించామని, ఒక్క ట్రిప్పు కూడా బయటకు తరలించలేదని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే నరికిన చెట్ల స్థానంలో స్థానిక జాతుల మొక్కలను పెద్ద ఎత్తున నాటి క్యాంపస్లో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామని రిజిస్ట్రార్ వెల్లడించారు.