విమాన ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పెరుగుతున్న విమాన టికెట్ ధరలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. దీనికి తోడు ఇంధన ధరలు కూడా పెరుగుతుండటంతో విమాన సంస్థలు టికెట్ ధరలను పెంచుతున్నాయి. దీంతో చాలామంది విమాన ప్రయాణాలకు బదులుగా రైళ్లు, బస్సులు వంటి ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.
దీని ప్రభావం నేరుగా విమాన రంగంపై పడుతోంది. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోవడంతో చాలా సర్వీసుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రయాణికులు తక్కువగా ఉండటంతో విమాన సంస్థలు కూడా నష్టాలను తగ్గించుకునేందుకు కొన్ని రూట్లలో విమానాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. మరికొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నాయి.
దేశంలోనే హైదరాబాద్లో ఎక్కువ తగ్గుదల
తాజాగా విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే దేశీయ విమాన ప్రయాణాల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్ మొదటి వారంతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ మొదటి వారానికి విమానాల్లో సీట్లు నిండే శాతం భారీగా తగ్గింది. దీనినే విమాన రంగంలో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (PLF) అని పిలుస్తారు. అంటే ఒక విమానంలో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారో తెలిపే లెక్క.
దేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య 1,58,444 మేర తగ్గింది. అంటే 12.1 శాతం తగ్గుదల నమోదైంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలతో పోలిస్తే ఇదే అత్యధిక తగ్గుదల. ఇతర విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గింది.
*చెన్నై విమానాశ్రయంలో 1,05,604 మంది తగ్గారు (11.7 శాతం).
*అహ్మదాబాద్లో 46,328 మంది తగ్గారు (7.7 శాతం).
*గౌహతిలో 20,290 మంది తగ్గారు (6.6 శాతం).
*కోల్కతాలో 45,916 మంది తగ్గారు (4.6 శాతం).
*ఢిల్లీలో 1,02,959 మంది తగ్గారు (3.4 శాతం).
*గోవాలో 5,783 మంది తగ్గారు (1.8 శాతం).
*బెంగళూరులో 23,949 మంది తగ్గారు (1.3 శాతం).
*ముంబైలో 19,562 మంది తగ్గారు (1 శాతం).
ఈ లెక్కలను చూస్తే హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
టికెట్ ధరలు పెరగడమే ముఖ్య కారణమా?
విమాన ప్రయాణాలు తగ్గడానికి ముఖ్య కారణాల్లో టికెట్ ధరల పెరుగుదల ఒకటి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలు చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. విమానాలను నడపడానికి పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. చమురు ధరలు పెరిగితే విమాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి సంస్థలు టికెట్ ధరలను పెంచుతున్నాయి.
దీంతో విమాన ప్రయాణం సామాన్యులకు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అత్యవసర పని ఉంటే తప్ప చాలామంది విమాన ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విమానాల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రయాణికులు తగ్గడంతో విమాన సంస్థలకు ఆదాయం కూడా తగ్గుతోంది. దీంతో నష్టాలను నియంత్రించేందుకు కొన్ని రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు విమానాలు తగ్గింపు
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర నగరాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య కూడా చాల తగ్గింది. పండుగల సమయంలో సాధారణంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈసారి కొన్ని దేశీయ రూట్లలో విమానాల సంఖ్య తగ్గడం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కొన్ని రూట్లలో పరిస్థితి ఇలా ఉంది.
*ఢిల్లీ – హైదరాబాద్: గతంలో వారానికి సగటున 408 విమాన సర్వీసులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 322కి తగ్గింది.
*హైదరాబాద్ – తిరుపతి: గతంలో వారానికి 168 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు కేవలం 82 మాత్రమే నడుస్తున్నాయి.
*హైదరాబాద్ – చెన్నై: గతంలో 190 సర్వీసులు ఉండగా ఇప్పుడు 132కి తగ్గాయి.
*హైదరాబాద్ – పాట్నా, వారణాసి: ఈ రెండు రూట్లలోనూ విమాన సర్వీసుల సంఖ్య సగానికి పైగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానాల సంఖ్య భారీగా తగ్గడం ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
విమాన రంగానికి ముందు ముందు కష్టకాలమేనా?
ప్రస్తుతం విమాన రంగం ఒకవైపు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, మరోవైపు తగ్గుతున్న ప్రయాణికులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టికెట్ ధరలు పెంచితే ప్రయాణికులు తగ్గుతున్నారు. ధరలు తగ్గిస్తే విమాన సంస్థలకు ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా రెండు వైపులా ఒత్తిడి పెరగడంతో విమాన సంస్థలు కొన్ని రూట్లలో సర్వీసులను తగ్గించే నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశీయ విమాన ప్రయాణాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు విమాన సర్వీసుల కొరత, టికెట్ ధరల భారం రెండూ సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే.. పెరిగిన ఇంధన ధరలు విమాన ప్రయాణలను కాస్ట్లీగా మార్చాయి. టికెట్ ధరల భారం తట్టుకోలేక ప్రయాణికులు విమాన ప్రయాణాలకు దూరమవుతున్నారు. ప్రయాణికులు తగ్గడంతో విమాన సంస్థలు సర్వీసులను తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి దేశీయ విమాన రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
