ఐదేండ్ల బాలిక హత్య కేసులో.. డిఫెన్సర్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ రద్దు

ఐదేండ్ల బాలిక హత్య కేసులో.. డిఫెన్సర్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ రద్దు
  • ప్రతి గార్డుకు పోలీస్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌, శిక్షణ తప్పనిసరి 
  • ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు ప్రభుత్వం వార్నింగ్ 

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: మేడ్చల్‌‌‌‌  మల్కాజిగిరి జిల్లా కౌకూర్‌‌‌‌లోని విల్లా ఆర్కిడ్స్‌‌‌‌లో గత నెల10న జరిగిన ఐదేండ్ల బాలిక హత్య కేసులో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. హత్యకు కారణమైన సెక్యూరిటీ గార్డును నియమించిన డిఫెన్సర్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ను రద్దు చేసింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదేండ్ల చిన్నారి హత్య కేసులో డిఫెన్సర్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌ ఏజెన్సీకి చెందిన సెక్యూరిటీ గార్డు ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఆ సంస్థ లైసెన్స్‌‌‌‌ను రద్దు చేసినట్లు వెల్లడించింది. 

ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (పీఎస్‌‌‌‌ఏఆర్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ -2005)లోని సెక‌‌‌‌్షన్‌‌‌‌ 13 కింద ఈ చర్య తీసుకుంది. తక్షణమే అన్ని భద్రతా కార్యకలాపాలను నిలిపివేయాలని, ఏడు రోజుల్లో అసలు లైసెన్స్‌‌‌‌ను అధికారులకు అప్పగించాలని ఆదేశించింది. సెక్యూరిటీ గార్డులకు సరైన పోలీస్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌, తప్పనిసరి శిక్షణ లేకుండానే విధుల్లో నియమించడం, పర్యవేక్షణలో లోపాలు, షోకాజ్‌‌‌‌ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడం వంటి అంశాలను రద్దు ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు వార్ని్ంగ్

రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీలు  ప్రతి సెక్యూరిటీ గార్డు, సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌ను విధుల్లోకి తీసుకునే ముందే పోలీస్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌, శిక్షణ పూర్తి చేయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శారీరక దృఢత్వం కలిగిన శిక్షణ పొందిన సిబ్బందినే విధుల్లో నియమించాలని, వారి ఫొటో ఐడీ కార్డులు, శిక్షణ, వైద్యపరమైన అర్హతల రికార్డులను నిర్వహించాలని అదేశించింది. ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీల సేవలు వినియోగించుకునే వ్యక్తులు, సంస్థలు ముందుగా వాటి లైసెన్స్‌‌‌‌ నంబరు, గడువు, అనుమతించిన పరిధిని పరిశీలించాలని సూచించింది.

 విధుల్లో ఉండే ప్రతి గార్డు పోలీస్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌, శిక్షణకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా తీసుకోవాలని, ఫొటో ఐడీ కార్డులను పరిశీలించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ కార్యకలాపాలపై తెలంగాణ పీఎస్‌‌‌‌ఏఆర్‌‌‌‌ కంట్రోలింగ్‌‌‌‌ అథారిటీ లేదా సమీప పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని  పేర్కొంది.