- తల్లాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
- బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి
తల్లాడ, వెలుగు: మురసు తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగిలేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తల్లాడ మండలంలో బీజేపీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో తుఫాన్‌కు దెబ్బతిన్న వరి పంటలను పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్యతో ఫోన్లో మాట్లాడి పంట నష్టం పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన అధికారి పంట నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో, పంటలను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి ఉంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కొంత భరోసా లభించేదన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తల్లాడ మండల అధ్యక్షుడు చల్లా నాగులు, పాలేరు ఇన్చార్జి నున్న రవి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకట రామారావు, నాయకులు నన్నపనేని శారద, రైతులు తదితరులు పాల్గొన్నారు.
