- అర్హత ఉన్నవాళ్లందరికీ పెన్షన్లు
- ఎమ్మెల్యే శ్రీహరి, ఎంపీ కావ్య
ధర్మసాగర్, వెలుగు : రాజకీయ ఉనికి కోసం అబద్ధపు ప్రచారాలు చేసే ప్రతిపక్షాలకు ప్రజలే సమాధానం చెబుతారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం నూతన పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ధర్మసాగర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 58 మందికి రూ.19.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 27 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
కాశగూడెం గ్రామానికి 15 మంది తుర్కకాశ కులస్తులకు టూల్ కిట్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేయూత పింఛన్లు అందిస్తుందని, పింఛన్ల మంజూరుకు ఎలాంటి టార్గెట్ లేదని కడియం శ్రీహరి అన్నారు. అధికారం కోల్పోయామన్న అసహనంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు విషం కక్కుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ చారిత్రక పాత్ర ఉందని కడియం కావ్య అన్నారు. మహిళ సర్పంచులు వారు స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించేలా భర్తలు ప్రోత్సహించాలని సూచించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
