ఏపీలో రూ.700 కోట్లతో ల్యాప్ టాప్ తయారు ఫ్యాక్టరీ..

ఏపీలో రూ.700 కోట్లతో ల్యాప్ టాప్ తయారు ఫ్యాక్టరీ..

విశాఖపట్నంలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో రెండో రోజు భాగంగా శుక్రవారం ( నవంబర్ 13 ) డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తో సమావేశమయ్యారు మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ తో భేటీ అనంతరం తిరుపతి - EMC-IIలో కొత్తగా రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సుముఖత వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్ర యువతకు 2,300 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ ప్లాంట్ అయిన డిక్సన్ తిరుపతి హబ్... కొప్పర్తి, తిరుపతిలో విస్తరణ ప్రణాళికలను రూపొందించడంపై ధన్యవాదాలు తెలిపారు లోకేష్. డిక్సన్-ఇన్వెంటెక్ JV కింద ల్యాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు లోకేష్. 

డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ మాట్లాడుతూ... డిక్సన్ టెక్నాలజీస్ కు ఇండియాలోనే అతిపెద్ద LED టీవీ ప్లాంట్ (షియోమి, ఇతర బ్రాండ్లు) ఇన్-హౌస్ LCM లైన్ తో 2018 నుంచి తిరుపతిలో ఉందని అన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ (సీపీ ప్లస్)ను రూ.450కోట్లతో విస్తరిస్తున్నామని.. దీని ద్వారా 7వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. దీనికి ఇప్పటికే ఎస్ఐపీబీ ఆమోదం లభించిందని... ఏపీ సర్కార్  ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.