David Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న 2018 సాండ్‌పేపర్ (బాల్ ట్యాంపరింగ్) వివాదం మరో మలుపు తిరిగింది. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబర్' (Sabr) లో చేసిన ఆరోపణలను టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కొట్టిపారేయడంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిన్స్ కావాలనే ఖవాజాను బలిపశువును చేశారని (threw under the bus) వార్నర్ సంచలన ఆరోపణలు చేశారు. ఖవాజా తన పుస్తకంలో రాసినవన్నీ అక్షరాలా నిజమేనని స్పష్టం చేస్తూ.. ఆ ఘటన వల్ల తాను, తన భార్య బిడ్డను కోల్పోయామంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఖవాజాకు వార్నర్ మద్దతు:
* ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు ఫాక్స్ క్రికెట్ తో మాట్లాడిన డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
* ఖవాజా రాసిందే నిజం: నేను ఇప్పటికీ ఉస్మాన్ ఖవాజాకు అండగా నిలుస్తున్నాను.. అతను తన పుస్తకంలో రాసినవన్నీ నిజాలే.. కెప్టెన్ కమిన్స్ ఇవాళ ఖవాజాను బలిపశువును చేయడం నన్ను తీవ్రంగా నిరాశపరిచిందని వార్నర్ అన్నారు.
* జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాం: గత ఎనిమిదేళ్లుగా నేను దీనిపై మాట్లాడలేదు.. కానీ, నేను, స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ప్రతిరోజూ ఆ శిక్షను అనుభవిస్తూనే ఉన్నాం.. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అవమానాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మేము బిడ్డను కోల్పోయాం: వార్నర్
ఆ వివాదం తమ కుటుంబంపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో వివరిస్తూ డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు.. కానీ, అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయింది నేను, నా భార్య క్యాండిస్.. ఆ ఒత్తిడి సమయంలో మేము మా బిడ్డను (గర్భస్రావం) కోల్పోయాం.. ఆ నిజాన్ని అందరూ అంగీకరించే వరకు ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుందని వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఈ వివాదానికి ముగింపు పలకాలి: జస్టిన్ లాంగర్
మరోవైపు, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందిస్తూ.. కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చేయాల్సింది చేశారని సమర్థించారు. కానీ, ఈ చేదు జ్ఞాపకాల వల్ల ఆస్ట్రేలియా క్రికెట్‌తో పాటు అభిమానులు కూడా ఎంతో బాధపడుతున్నారని, ఇకనైనా ఈ వివాదానికి ముగింపు పలికి ముందుకు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
