ఐసీసీ కొత్త రూల్స్.. విదేశీ ఆటగాళ్లపై ఆంక్షలు.. IPL, ILT20, MLCలకు బిగ్ షాక్!

ఐసీసీ కొత్త రూల్స్.. విదేశీ ఆటగాళ్లపై ఆంక్షలు.. IPL, ILT20, MLCలకు బిగ్ షాక్!

ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు ముకుతాడు వేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమైంది. అన్ని టాప్-టైర్ టీ20 లీగ్‌లను ఒకే నిబంధన కిందకు తీసుకురావడానికి ఐసీసీ కీలక ప్రతిపాదనలు రూపొందించేందుకు రెడీ అయింది. ఇండోనేషియాలోని బాలి (Bali) వేదికగా జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ కొత్త రూల్స్‌పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే యూఏఈకి చెందిన ILT20, అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC) లకు భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు ఐసీసీ ప్రతిపాదిస్తున్న కొత్త రూల్స్: 

గత జులైలో ఫ్రాంచైజీ లీగ్‌ల పని తీరును సమీక్షించేందుకు ఐసీసీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఐసీసీకి సమర్పించిన ప్రధాన ప్రతిపాదనలు ఇవే:

* విదేశీ ఆటగాళ్లపై పరిమితి (Overseas Player Cap): ప్రతి లీగ్‌లో తుది జట్టు (Playing XI) లో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు ఉండాలనే దానిపై ఐసీసీ ఒక నిర్దిష్ట పరిమితిని విధించనుంది. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

* బెట్టింగ్ కంపెనీల స్పాన్సర్‌షిప్‌పై నిషేధం: ఏ ఫ్రాంచైజీ లీగ్‌కు కూడా బెట్టింగ్ కంపెనీలు లేదా వాటి సరోగేట్ (పరోక్ష) సంస్థలు స్పాన్సర్‌లుగా ఉండకుండా కఠిన నిబంధనలు తీసుకురావడం.

* శాంక్షన్ ఫీజు, ఆడిటింగ్: లీగ్‌లకు అనుమతులు (Sanction) ఇవ్వడానికి ఐసీసీ ప్రత్యేక ఫీజు వసూలు చేయడంతో పాటు ఆ లీగ్‌ల ఆర్థిక వ్యవహారాలను తనిఖీ (Audit) చేసే అధికారాన్ని పొందడం.

ILT20, MLC లీగ్‌లకే ఎందుకు భారీ దెబ్బ: 

భారత్‌లో జరిగే IPL, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ (BBL) లాంటి టోర్నీలలో తుది జట్టులో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, యూఏఈ నిర్వహించే ILT20 లో తుది జట్టులో ఏకంగా 9 మంది విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు పర్మిషన్ ఉంది. అలాగే, అమెరికాలోని MLC లో 6 గురు విదేశీ ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. అమెరికా, యూఏఈ దేశాల్లో స్టార్ క్రికెటర్లు లేకపోవడంతో, అభిమానులను ఆకర్షించడానికి ఆ లీగ్‌లు పూర్తిగా విదేశీ స్టార్లపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఐసీసీ గనుక విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 4 లేదా 5కు పరిమితం చేస్తే, ఆ లీగ్‌ల ఆదాయంపై, క్రేజ్‌పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.