చిలుకపచ్చ రంగు.. ఎర్ర జరీ అంచు..! ఆకట్టుకునేలా ఇందిరమ్మ చీరలు.. నవంబర్ 19న పంపిణీ

చిలుకపచ్చ రంగు..  ఎర్ర జరీ అంచు..! ఆకట్టుకునేలా ఇందిరమ్మ చీరలు.. నవంబర్ 19న పంపిణీ
  • రూ.334 కోట్ల బడ్జెట్​తో చీరల తయారీ 
  • 95 లక్షల మందికి వారంలోగా అందించే ప్లాన్ 
  • పక్కదారి పట్టకుండా మొబైల్ యాప్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ఉచిత చీరల పంపిణీకి సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులున్న దాదాపు 95 లక్షల మంది మహిళలకు వారం రోజుల్లో చీరలు అందించేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో సెర్ప్ కార్యాచరణ రూపొందించింది. 

గత ప్రభుత్వ హయాంలో సాధారణ పాలపిట్ట రంగు చీరలు పంపిణీ చేయగా.. ఈసారి ప్రభుత్వం కొత్త డిజైన్‌‌ను ఎంపిక చేసింది. ఇంట్లోనే కాకుండా శుభకార్యాలు, పండుగల వేళల్లోనూ ధరించేలా నాణ్యతా ప్రమాణాలతో రూపొందించింది. చిలుకపచ్చ రంగు బాడీపై ఎరుపు రంగు పట్టు, జరీ అంచుతో చీరలు ఆకట్టుకునేలా తయారు చేశారు. వీటి కోసం ప్రభుత్వం రూ.334 కోట్లు కేటాయించింది. రాజన్న సిరిసిల్లతోపాటు పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్ నుంచే చీరల తయారీ చేపట్టింది. మహిళా సంఘాల వీవోఏలు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో గ్రామాల్లో వారం రోజులపాటు పంపిణీ చేయనున్నారు.

పక్కదారి పట్టకుండా మొబైల్ యాప్..

గతంలో ఉచిత చీరల పంపిణీలో దొంగ లెక్కలు రాశారని, అర్హులకు అందకుండా పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటి అక్రమాలకు తావులేకుండా సెర్ప్ సాంకేతికతను వినియోగిస్తోంది. గ్రామాల్లోని పంపిణీ కేంద్రాల వద్ద లేదా సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు మహిళలు ఆధార్ కార్డు చూపించాలి. చీర తీసుకునే సమయంలో లబ్ధిదారు ఫొటోను మొబైల్ యాప్‌‌లో సేకరిస్తారు. ఆధార్, ఫొటో వివరాలు యాప్‌‌లో ధ్రువీకరించిన తర్వాతే చీర అందిస్తారు. దీంతో ఒకరి చీరను మరొకరు తీసుకోవడం, ఒకే వ్యక్తి రెండోసారి పొందడం సాధ్యం కాదు. 

రెండు నెలల క్రితమే తయారీ..

2నెలల క్రితమే చీరల తయారీ పూర్తయినా.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 163 కేంద్రాల్లో తయారు చేసిన చీరలను జిల్లా కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు పంపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.