ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న యువతులకు లక్ష్మీ పూజ చేయిస్తే సంపద కురిపిస్తుందని నమ్మించి వేశ్యావృత్తిలోకి దింపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు బళ్లారి పోలీసులు. దాదాపు రెండు నెలల పాటు నిర్వహించిన అండర్‌కవర్ ఆపరేషన్‌లో 11 మందిని అరెస్ట్ చేసి, నలుగురు మహిళలను రక్షించామని తెలిపారు పోలీసులు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెళ్ళికాని యువతులను ఈ ముఠా టార్గెట్ చేసిందని పోలీసులు తెలిపారు. మూఢనమ్మకాలపై వారికున్న నమ్మకాన్ని వాడుకుని, ఒక గురువు ద్వారా లక్ష్మీ పూజ చేయిస్తే అపారమైన సంపద వస్తుందని నమ్మించేవారని పోలీసులు చెప్పారు.
సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తున్న, శరీరంపై మచ్చలు, గాయాల గురుతులు లేని అవివాహిత యువతుల ఫొటోలు సేకరించేవారని... సాధారణ ఫొటోలతో పాటు కుడి చేయి, కుడి కాలి ఫొటోలు కూడా అడిగేవారని తెలిపారు పోలీసులు. ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించిన తర్వాత యువతులను శార్ట్లిస్ట్ చేసి, పూజలో పాల్గొంటే మంచి డబ్బు వస్తుందని ఒప్పించేవారని పోలీసులు పేర్కొన్నారు. పూజ ద్వారా వచ్చే సొమ్మును మూడు భాగాలుగా పంచుతామని, ఒక వాటా యువతికి, ఒక వాటా పూజ చేసే గురువుకు, మరో వాటా వారిని తీసుకొచ్చిన ఏజెంట్‌కు అని నచ్చచెప్పేవారని పోలీసులు తెలిపారు.
అయితే ఈ పూజ అనేది వేశ్యావృత్తిని కప్పిపుచ్చే ముసుగు మాత్రమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతులను నగ్నంగా నిలబెట్టి వీడియోలు తీశారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ముఠాను పట్టుకోవడానికి బళ్ళారి పోలీసులు అక్కా ఫోర్స్ నుంచి మహిళా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపారు. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాధారణ మహిళలుగా నటిస్తూ ముఠాలో చేరారు. దాదాపు రెండు నెలల నిఘా, దర్యాప్తు తర్వాత అనుమానితులను గుర్తించి ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
బళ్ళారి, చిక్కమగళూరు, మైసూరుతో పాటు ఏపీలోని అనంతపురంలో కూడా ముఠా కార్యకలాపాలు నడిపిందని పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు 'మీడియా', 'పేపర్' వంటి కోడ్ వర్డ్స్ వాడుతూ సమన్వయం చేసుకునేవారని పోలీసులు వివరించారు.
11 మంది అరెస్ట్, నలుగురు మహిళలు సేఫ్..
బళ్ళారి APMC పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని... 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను రక్షించినట్లు తెలిపారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన 'DR' అనే కోడ్ నేమ్ ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.
ముఠా ఏ విధంగా యువతులను గుర్తించి రిక్రూట్ చేసిందో, పూజ పేరిట జరిగిన దోపిడీ ఎంత మేరకు ఉందో తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
