రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లందరూ రాహుల్ గాంధీ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( నవంబర్ 13 ) గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ గురించి మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకువచ్చమని.. రేపు జరిగే గిగ్ వర్కర్స్ బైక్ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని అన్నారు మంత్రి వివేక్. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ, సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లందరూ హాజరు కావాలని అన్నారు మంత్రి వివేక్.
గిగ్ వర్కర్ల కోసం వెల్ఫేర్ బోర్డు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ మరియు కంప్లైంట్స్ పోర్టల్‌ను రాహుల్ గాంధీ రేపు ప్రకటించనున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు టాటా (TATA) సంస్థ సీఎస్ఆర్ ఫండింగ్ రూ. 14 వేల కోట్లతో 65 పాత ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) మారుస్తున్నామని అన్నారు. వీటితో పాటు మరో 54 కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని అన్నారు మంత్రి వివేక్.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రూ. 2,000 స్టైఫండ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని.. టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.
ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలాంటి కష్టకాలంలో భారత్‌ను ప్రపంచానికి సరైన విధంగా పరిచయం చేస్తే భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా దేశంలోని చట్టాలు, పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు ఆత్మగౌరవం, హక్కులు కల్పించడమే ప్రధాన లక్ష్యమని.. అణచివేయాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వివేక్.
