రసగుల్లా అనుకుని నోట్లో వేసుకున్నాడు.. క్షణాల్లో పేలిన బాంబు.. స్పాట్ డెడ్ !

రసగుల్లా అనుకుని నోట్లో వేసుకున్నాడు.. క్షణాల్లో పేలిన బాంబు.. స్పాట్ డెడ్ !

స్వీట్ అనుకుని నోట్లో వేసుకున్న పదార్థం ప్రాణాలు తీస్తుందని ఆ వ్యక్తి ఏమాత్రం ఊహించలేదు. రసగుల్లా రూపంలో ఇచ్చిన పేలుడు పదార్థాన్ని నిజమైన మిఠాయిగా భావించి కొరకడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన 35 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని డిండోరీ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

డిండోరీ జిల్లా పడరియా ఛాంటా గ్రామంలో నవంబర్ 10వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాజేంద్ర బరోటియా (35) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఇంటి ఆవరణలో చలిమంట దగ్గర కూర్చున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రామ్‌భగత్ బరోటియా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటుండగా రామ్‌భగత్ తన దగ్గర ఉన్న ఒక వస్తువును రాజేంద్రకు ఇచ్చి అది రసగుల్లా అని చెప్పినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దానిని నిజంగానే స్వీట్ అనుకున్న రాజేంద్ర నోట్లో వేసుకుని కొరకగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

ౌతీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేంద్ర చనిపోయాడు. పేలుడు ధాటికి రాజేంద్ర నోరు, దవడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గాయాల తీవ్రత కారణంగా రాజేంద్ర ప్రాణాలు కాపాడలేకపోయారు. 

►ALSO READ | అస్సాంలో ఘోర ప్రమాదం: ట్రక్‎, మినీ బస్సు ఢీ.. 20 మంది స్టూడెంట్స్ మృతి

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బుధవారం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడవి పందులను చంపేందుకు ఉపయోగించే పేలుడు పదార్థం రసగుల్లలో ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో రామ్‌భగత్ బరోటియాతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షలా? ఉద్దేశపూర్వక చర్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.