రూ. 40 వేల 421 ట్యాబ్లెట్లు 2వేల 7వందలకే.. మందుల రేట్లు తగ్గడం అంటే ఇది..!

రూ. 40 వేల 421 ట్యాబ్లెట్లు 2వేల 7వందలకే.. మందుల రేట్లు తగ్గడం అంటే ఇది..!

క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించడంతో కొన్ని కీలకమైన క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరలు (MRP) గణనీయంగా తగ్గాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 'ఆర్పీజీ లైఫ్ సైన్సెస్' (RPG Life Sciences) సంస్థకు చెందిన 'పాల్బోప్రో' (Palbopro - Palbociclib 125 mg) క్యాప్సూల్స్ ధర రూ. 40,421.33 నుంచి రూ. 2,720కి తగ్గింది.

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో వాడే 'ఆర్విన్‌కేర్ ఫార్మా' (Arvincare Pharma) సంస్థకు చెందిన 'అబిరాన్' (Abiron - Abiraterone Acetate 250 mg) టాబ్లెట్ల ధర రూ. 41,250 నుండి రూ. 3,218.23కి తగ్గింది. కొత్తగా నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ రేటుకు మెడిసిన్స్​అమ్మడానికి మెడికల్ షాపులు, ఆస్పత్రుల ఫార్మసీలకు పర్మిషన్ లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మందుల ప్యాకెట్లపై ముద్రించిన కొత్త MRPని పరిశీలించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సూచించింది. ఫార్మా సహీదామ్ మొబైల్ యాప్ లేదా NPPA (National Pharmaceutical Pricing Authority) అధికారిక వెబ్‌‌‌‌సైట్ ద్వారా మందుల ధరలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. ఎవరైనా కొత్త ధరలకంటే ఎక్కువగా మందులు విక్రయిస్తే ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్‌‌‌‌లో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఫిర్యాదుల కోసం హెల్ప్‌‌‌‌లైన్ నంబర్: 1800-111-255 ను ఎన్పీపీఏ అందుబాటులోకి తెచ్చింది.

►ALSO READ | ఈ రేంజ్‎లో ర్యాగింగ్ ఏంటి సామీ: వైరల్‎గా ప్రకాష్ రాజ్ వీడియో

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌‌‌పీపీఏ) ఆదేశాల మేరకు ఇప్పటికే 76 ఫార్మా కంపెనీలు 121 రకాల మందులకు సంబంధించిన 1,225 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి. వీటిలో 1,031 ఫార్ములేషన్ల ధరలు తగ్గాయి. 600 బ్రాండ్లపై 50 శాతానికి పైగా కోత పడగా, అత్యధికంగా 96.45 శాతం తగ్గింపు నమోదైంది. రిటైలర్లు, ఆసుపత్రులు కొత్త ధరల పట్టికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.