మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగాలన్న ఎయిర్ టెల్ అధినేత.. రీఛార్జ్కి నెలకు కనీసం ₹350 కట్టాలంట !

మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగాలన్న ఎయిర్ టెల్ అధినేత.. రీఛార్జ్కి నెలకు కనీసం ₹350 కట్టాలంట !

భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ భారతదేశంలో మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతదేశంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు సగటున కనీసం ₹350 ఆదాయం రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

అంటే రోజుకు సుమారు ₹10 నుంచి ₹12 వరకు ఒక్కో వినియోగదారుడి నుంచి టెలికాం కంపెనీలకు ఆదాయం రావాలన్నది ఆయన అభిప్రాయం. దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్క్‌ను నిర్వహించడం, కొత్త టవర్ల నిర్మాణం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ, 5G సేవల అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు అవసరమవుతున్నాయని మిట్టల్ పేర్కొన్నారు. టెలికాం రంగంలో పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రావాలంటే మొబైల్ టారిఫ్‌లు పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

నెలకు ₹350 అంటే రోజుకు సగటున ₹10 నుంచి ₹12 మాత్రమేనని, ఈ మొత్తం పెద్ద భారం కాదని మిట్టల్ అభిప్రాయపడ్డారు. కూల్ డ్రింక్స్, చిప్స్ ధరల కంటే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలే చీప్గా ఉన్నాయని భారతీ మిట్టల్ చెప్పుకొచ్చారు. బ్యాంకింగ్ సేవలు, UPI చెల్లింపులు, విద్య, ఆరోగ్య రికార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు, వినోదం వంటి అనేక సేవలకు మొబైల్ ఫోన్ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదిస్తున్న ₹350 సగటు ఆదాయం అనేది ₹200కు పైబడిన ఎంట్రీ స్థాయి ప్లాన్లు, ₹500, ₹700, ₹800, ₹1,000 వంటి అధిక ధరల ప్లాన్ల కలయికతో సాధ్యమవుతుందని వివరించారు.

►ALSO READ | దేశంలో డెంగ్యూ, వడదెబ్బతో జనం అల్లాడిపోతారు: ఎల్‌నినోపై WHO వార్నింగ్

ఎయిర్‌టెల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు సగటున 271 రూపాయల ఆదాయం పొందుతోంది. గత ఏడాది ఈ మొత్తం 256 రూపాయలుగా ఉంది. అంటే మిట్టల్ ప్రతిపాదిస్తున్న 350 రూపాయల లక్ష్యం ప్రస్తుతం ఎయిర్‌టెల్ సాధిస్తున్న 271 రూపాయల సగటు ఆదాయం కంటే దాదాపు 29 శాతం ఎక్కువ. దేశంలో చివరిసారిగా ప్రధాన టెలికాం కంపెనీలు 2024 జూన్‌లో మొబైల్ టారిఫ్‌లను సుమారు 10 నుంచి 25 శాతం వరకు పెంచాయి.

సునీల్ భారతీ మిట్టల్ చెబుతున్న ప్రకారం.. చైనాలో 10 లక్షలకు పైగా మొబైల్ టవర్లు ఉండగా, భారతదేశంలో సుమారు 3.5 లక్షల టవర్లు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో కూడా టవర్ల సంఖ్యను కనీసం రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 5G సేవల కోసం టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, స్పెక్ట్రమ్ కొనుగోలుకే లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, నెట్‌వర్క్ నిర్మాణానికి కూడా భారీ మొత్తాలు వెచ్చించాల్సి వచ్చిందని మిట్టల్ చెప్పారు. అయితే 5G ద్వారా ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం రావడం లేదని, ఈ విషయంలో టెలికాం పరిశ్రమ కొంత నిరాశకు గురైందని ఆయన వ్యాఖ్యానించారు.