ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్‌ను స్వయంగా ప్రధాని మోడీనే ట్యాప్ చేయిస్తున్నారంటూ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఇన్‌స్టాగ్రామ్ Q&A సెషన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన సెల్‌ఫోన్‌లో ప్రభుత్వ అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ప్రధాని కనుసన్నల్లోనే తనపై నిఘా కొనసాగుతోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరేశారు. పార్లమెంట్‌లో తమ గొంతు నొక్కుతున్నారని, కీలకమైన అంశాలపై మాట్లాడకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, చైనా అంశం, ఎన్నికల సంఘం తీరు, అదానీ వ్యవహారం, జెఫ్రీ ఎప్‌స్టీన్ వంటి ఎన్నో సున్నితమైన విషయాలపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అనుమతించలేదన్నారు. అందుకే ప్రధాని మోడీతో వన్-ఆన్-వన్ పబ్లిక్ డిబేట్‌కు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ చర్చకు ఒకవైపు ప్రధాని మోడీ, మరోవైపు తాను కూర్చుంటామని.. ఒకవేళ కావాలంటే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అదానీని జడ్జిగా పెట్టుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సవాల్ విసిరారు.
𝐓𝐡𝐞 𝐨𝐧𝐞-𝐨𝐧-𝐨𝐧𝐞 𝐝𝐞𝐛𝐚𝐭𝐞 𝐰𝐢𝐥𝐥 𝐩𝐫𝐨𝐯𝐞 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢 𝐢𝐬 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐥𝐥𝐞𝐝 𝐛𝐲 𝐟𝐨𝐫𝐞𝐢𝐠𝐧 𝐩𝐨𝐰𝐞𝐫𝐬 𝐚𝐧𝐝 𝐢𝐬 𝐚𝐧𝐭𝐢-𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥. https://t.co/lhcxKdv6ph
— Congress (@INCIndia) November 13, 2026
ఈ బహిరంగ చర్చ జరిగితే అసలు దేశాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో, విదేశీ శక్తుల ప్రభావం ఎవరిపై ఉందనే నిజాలు బట్టబయలవుతాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానితో ఒక్కసారి ఫేస్-టూ-ఫేస్ డిబేట్ నిర్వహిస్తే.. ఆ తర్వాత మోడీ ఆ పదవిలో కొనసాగలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ డిబేట్ డిమాండ్‌ను బీజేపీ తీవ్రంగా తోసిపుచ్చింది. పార్లమెంటే చర్చలకు సరైన వేదికని, బయట ఇలాంటి సవాళ్లు విసరడంలో అర్థం లేదని కేంద్ర మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా.. రాహుల్ గాంధీ చేసిన తాజా ఫోన్-ట్యాపింగ్ ఆరోపణలు, పబ్లిక్ డిబేట్ సవాల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
