ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్. తాము చెప్పినట్టుగా లక్ష్మీపూజ చేస్తే అపారమైన సంపద వస్తుందని, కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుందని ఆశ చూపిస్తూ వారిని మోసం చేస్తారు. వ్యభిచార రొంపిలోకి దింపుతారు.
ఈ దందాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కర్ణాటకలోని బళ్లారి పోలీసులు రట్టు చేశారు. మత విశ్వాసాన్ని, మహిళల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని చేస్తున్న ఈ చీకటి దందాకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నలుగురు మహిళలను వారి చెర నుంచి రక్షించారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఈ ముఠా సభ్యులు ప్రధానంగా అవివాహితులు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. లక్ష్మీపూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నమ్మించేవారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత వివరాలు, ఫొటోలను సేకరించేవారని సమాచారం.
కొంతమంది మహిళలను ఎంపిక చేసుకునేందుకు వారి శారీరక రూపం, ఎత్తు వంటి అంశాలను కూడా పరిశీలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా కుడిచేతి, కుడికాలి ఫొటోలను ప్రత్యేకంగా తీసుకున్నారు. లక్ష్మీపూజ పేరుతో మహిళలను నమ్మించి, ఆ తర్వాత వారిని లైంగిక దోపిడీకి గురిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధిత మహిళల అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, వాటిని బయటపెడతామని బెదిరిస్తూ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేసి సొమ్ము చేసుకున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
మహిళా పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్ చేసి రెండు నెలల నిఘా పెట్టగా ఈ ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠా కార్యకలాపాలను బయటపెట్టేందుకు బళ్లారి పోలీసుల అకా ఫోర్స్‌కు చెందిన మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల్లా మారువేషంలో ముఠాలోకి ప్రవేశించి, దాదాపు రెండు నెలల పాటు రహస్యంగా సమాచారాన్ని సేకరించారు. నిందితుల కదలికలు, వారి వ్యవహార శైలి, నెట్వర్క్ వివరాలను తెలుసుకున్న అనంతరం పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు బాధిత మహిళలను రక్షించారు.
