మిగతా పార్టీలను శత్రువులుగా చేసే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం : డిప్యూటీ సీఎం భట్టి

మిగతా పార్టీలను శత్రువులుగా చేసే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం : డిప్యూటీ సీఎం భట్టి

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. అదే స్థాయిలో ప్రతిపక్షానికీ అంతే బాధ్యత, ప్రాధాన్యత ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ లో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌ 2.0 లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర అనే అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. 

ప్రజలు, సమాజం కోసం జరిగే చర్చలను కొందరు వినోదంగా చూస్తున్నారని.. ఈ ధోరణి మారాలని.. సమస్యల పరిష్కారంపై దశ, దిశ, మార్గదర్శకంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ప్రతిపక్షాలను శత్రువులుగా చూసే ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని.. ప్రతిపక్షం అయినా.. అధికార పక్షం అయినా.. విధానపరమైన విభేదాలు మాత్రమే ఉండాలని.. శత్రుత్వంతో కూడిన ద్వేషం ఉండకూడదని సలహా ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

ALSO READ : కేసీఆర్ కు వెన్నుపోటు పొడవడం తప్ప హరీష్ రావు ఏం చేయలేదు

సమాజంలో విభజన, ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగానే రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేశారని.. దేశం అంతా ఒక సమాజంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారాయన. దేశ, విదేశాల్లో యువత తమ గళం వినిపించటానికి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారని.. అలాంటి వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదని.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలన్నారు భట్టి విక్రమార్క. ఆందోళనకారులను, ప్రశ్నించే వారిని శత్రువులుగా చూడకుండా.. వారి సమస్యలను అర్థం చేసుకుని.. పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.