కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇంత ఖర్చు చేసినా రైతులకు అవసరమైన సమయంలో నీళ్లు అందడం లేదని విమర్శించారు. దివంగత కాకా జి. వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే ప్రస్తుత కరువు పరిస్థితులు ఏర్పడేవి కావని అన్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కేసీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయాల ఫలితమని విమర్శించారు.
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ..పలు గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బోర్‌వెల్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ.1.20 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పత్తిపాక, నర్సింగాపూర్ గ్రామాల్లో రూ.12 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సీసీ రోడ్లు, బోర్‌వెల్స్, డ్రైనేజీ నిర్మాణాల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారుఎంపీ వంశీకృష్ణ.
కేసీఆర్, కేటీఆర్‌కు ఎంపీ వంశీకృష్ణ బహిరంగ సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టును సరైన పద్ధతిలో నిర్మించామని నమ్మకం ఉంటే కేసీఆర్, కేటీఆర్ ప్రాజెక్టు దిగువ భాగంలో నిలబడి పంపులు ఆన్ చేయాలని ఎంపీ వంశీకృష్ణ బహిరంగ సవాల్ విసిరారు. ప్రాజెక్టు భద్రతపై అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ పంపులు ఆన్ చేయాలని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు కూడా రాష్ట్రంలో సాగునీటి సమస్యకు కారణమవుతున్నాయని ఆరోపించారు.
ప్రజల భద్రతే ముఖ్యం.. NDSA సూచనల మేరకే నిర్ణయాలు
కాళేశ్వరం బ్యారేజీల భద్రతకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీని వినియోగించవద్దని సూచనలతో భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భద్రతా సూచనలను పక్కనపెట్టి పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేయడం సరికాదని అన్నారు.
20 వేల మందికి శిక్షణ.. 10 వేల మందికి ఉద్యోగాలు లక్ష్యం
మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని వంశీకృష్ణ అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. 'నీళ్లు, నిధులు, నియామకాలు' నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఏటీసీ (ATC) శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 20 వేల మందికి శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ వంశీకృష్ణ వివరించారు.
