రీల్స్ పిచ్చితో బుర్ర పాడు : పులితో వీడియో కోసం బోను గేటు తీశాడు.. మీదపడి తినేసింది..!

రీల్స్ పిచ్చితో బుర్ర పాడు : పులితో వీడియో కోసం బోను గేటు తీశాడు.. మీదపడి తినేసింది..!

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియోలు వైరల్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన స్టాంట్స్  చేస్తున్నారు. ఇలాంటి ఓ సరదా వీడియో షూటింగ్ చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం బోనులో ఉన్న ఆడపులిని బయటకు తీసుకురాగా.. అది ఓ 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చంపేసింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చోటుచేసుకుంది.

టిక్‌టాక్ వీడియో కోసం 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగింది. నోమన్ హసన్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అక్కడ టిక్‌టాక్ వీడియో చిత్రీకరించేందుకు వచ్చాడు. ఇందుకోసం అక్కడ పెంచుతున్న ఆడపులిని దాని బోను నుంచి బయటకు తీసుకొచ్చారు.

వీడియో షూటింగ్‌లో పాల్గొనాలని 19 ఏళ్ల తల్హా అనే వ్యవసాయ కార్మికుడిని కోరారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో పులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో తల్హాకు తీవ్ర గాయాలయ్యాయి.

పులి దాడి తర్వాత అక్కడున్న వారు వెంటనే స్పందించారు. టిక్‌టాకర్ నోమన్ హసన్ స్వయంగా తల్హాను కారులో ఎక్కించుకుని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్హా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మొదట కుక్క దాడిగా చిత్రీకరించే ప్రయత్నం!
ఈ ఘటన జరిగిన వెంటనే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మొదట తల్హాపై కుక్క దాడి చేసిందని చెప్పేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఘటనపై అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

దర్యాప్తులో తల్హాపై దాడి చేసింది కుక్క కాదని, ఫామ్‌హౌస్‌లో పెంచుతున్న ఆడపులి అని తేలింది. టిక్‌టాక్ వీడియో షూటింగ్ కోసమే పులిని బోనులో నుంచి బయటకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

ఫామ్‌హౌస్ యజమాని, టిక్‌టాకర్ అరెస్ట్
ఈ ఘటనపై తల్హా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫామ్‌హౌస్ యజమానితో పాటు టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ నోమన్ హసన్‌ను అరెస్టు చేశారు. మరోవైపు దాడి చేసిన ఆడపులిని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని వన్యప్రాణి శాఖకు అప్పగించారు.

పులిని పెంచేందుకు అనుమతులు ఉన్నాయా?
ఈ ఫామ్‌హౌస్‌లో ఆడపులిని పెంచేందుకు యజమానికి ప్రభుత్వం నుంచి అవసరమైన లైసెన్సులు ఉన్నాయా ? లేదా ? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు, అంత ప్రమాదకరమైన జంతువును వీడియో షూటింగ్ కోసం బయటకు తీసుకొచ్చినప్పుడు తగిన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

కేవలం ఓ టిక్‌టాక్ వీడియో కోసం చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం చేసే ప్రమాదకరమైన స్టాంట్స్  ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.