వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీసీసీఐ అండర్ 19 జట్టుకు సెలెక్ట్ అయిన యువ క్రీడాకారిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటూ క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని.. యువకుల వేధింపుల కారణంగా ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. యాలాల్ మండలం సంగయ్య పల్లికి చెందిన నందిని(17) వికారాబాద్ టౌన్ లో అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. స్పెషల్ కోచింగ్ తీసుకుంటూ మంచి క్రికెటర్ గా రాణిస్తోంది. ఇటీవలే బీసీసీఐ అండర్ 19 కు ఎంపికైనట్లు చెబుతున్నారు.
2026 నవంబర్ 13న వికారాబాద్ మధు కాలనీలో ఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనిల్, కృష్ణ అనే ఇద్దరు విద్యార్థులు కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు బంధువులు తెలిపారు. అనిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని.. అతనికి సపోర్ట్ గా కృష్ణ అనే మరొక విద్యార్థి వేధింపులకు గురి చేసినట్లు అమ్మాయి బంధువులు చెబుతున్నారు.
నందినిని వేధించిన యువకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ పట్టణంలో కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో టౌన్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంచి భవిష్యత్తు ఉన్న నందిని జీవితాన్ని నాశనం చేశారని.. యువకులకు శక్ష పడేవరకు వదిలేది లేదని రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
