విశాఖపట్నంలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండో రోజులో భాగంగా ఏంఓయూల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం, ( నవంబర్ 13 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, ప్రాజెక్టులను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.స్పేస్ రంగ పరిశ్రమల కోసం తిరుపతి సమీపంలో 5 వేల ఎకరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దేశంలోని ఐఐటీలు ఏపీని పరిశోధనలకు ప్రయోగశాలగా మార్చుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సెమీకండక్టర్లు, ఏఐ, క్వాంటం టెక్నాలజీ, ఏరోస్పేస్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని అన్నారు చంద్రబాబు. పెట్టుబడుల ద్వారా సంపద సృష్టించడంతో పాటు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పీ4 కార్యక్రమంలో భాగంగా 25 వేల బంగారు కుటుంబాలకు చేయూత అందించేందుకు పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
టీవీఎస్ సంస్థ కుప్పంలో ఓ ఇటుక బట్టీ కార్మికురాలికి ఆర్థిక చేయూతనిచ్చి, ఆమెను ఇటుక బట్టీ యజమానిగా తీర్చిదిద్దిందని... ప్రస్తుతం ఆమె మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపారవేత్తగా ఎదగడం స్ఫూర్తిదాయకమన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే తన నిరంతర తాపత్రయమని అన్నారు చంద్రబాబు.
