దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు గాలి నాణ్యత సూచీ(AQI) ఏకంగా 400 మార్కును దాటి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రజలు పీల్చేందుకు ఆక్సిజన్ ఖరువై అల్లాడిపోతూ నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ రవాణా శాఖ పంపిన ఒక టెక్స్ట్ మెసేజ్ టెక్ నిపుణులు, సామాన్యులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 3 నెలలు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామంది. ఈ వ్యవహారంపై ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రభుత్వ తీరును నిలదీస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన సీఏ అర్జున్ టండన్ తన వాహన పొల్యూషన్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ కాబోతుందంటూ రవాణా శాఖ నుంచి వచ్చిన హెచ్చరిక స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రాధాన్యతలను తీవ్రంగా ప్రశ్నించారు. "ప్రజలను రోజూ 400 AQI ఉన్న విషపూరిత గాలిని పీల్చేలా బలవంతం చేస్తూ.. మరోవైపు ఎక్స్పైర్డ్ పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందంటూ 3 నెలలు జైలు శిక్ష పడుతుందని బెదిరించే ప్రభుత్వానికి ఎంత ధైర్యం" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు.
ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హెచ్చరికల తీరు చూస్తుంటే.. కాలుష్య నియంత్రణ కంటే జరిమానాల ద్వారా రెవెన్యూ వసూలు చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని కొందరు విమర్శించారు. రోడ్లపై నల్లటి పొగలు కక్కుతున్న భారీ వాహనాలు, స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు.. నిబంధనలు పాటించే BS6 టూ-వీలర్ యజమానులను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు.
పీఆర్సీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఇలాంటి చర్యలు అవసరమని కొందరు వాదిస్తున్నప్పటికీ.. ప్రధాన సమస్యను గాలికొదిలేసి సామాన్యులను వేధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఢిల్లీలో విష గాలి సమస్యను పక్కనపెట్టి.. సర్టిఫికెట్ల పేరుతో జైలు శిక్షలంటూ బెదిరిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్తసుద్ధి ఉంటే గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చైనా లాంటి దేశాలు ఫాలో అవుతున్న పద్ధతులు తెలుసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
