NZ vs IND: భారత క్రికెట్ అభిమానులకు ఇదొక పీడకల! న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్, కనీసం 100 పరుగుల మార్క్‌ను కూడా దాటలేక కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 244 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఈ ఘోర అవమానంలోనూ టీమిండియాకు ఒకే ఒక్క ఊరట కలిగించే అంశం ఉంది. కేవలం ఒక్క పరుగు తేడాతో వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నుంచి టీమిండియా తృటిలో తప్పించుకుంది.
వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు:
భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇప్పటి వరకు అతిపెద్ద ఓటమి 2000 సంవత్సరంలో నమోదైంది. అప్పట్లో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగులకే ఆలౌట్ అయి 245 పరుగుల తేడాతో ఓడిపోయింది. సరిగ్గా 26 ఏళ్ల తర్వాత, ఇవాళ (నవంబర్ 13, 2026) మౌంట్ మౌంగనుయ్ (Mount Maunganui)లో ఆ చెత్త రికార్డు బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. భారత జట్టు 88 పరుగుల వద్ద ఆలౌట్ అయి ఉంటే, చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిగా నిలిచిపోయేది. కానీ ఆఖర్లో యువ బ్యాటర్ నమన్ ధీర్ (21) బాదిన రెండు సిక్సర్లు, కొన్ని ఎక్స్‌ట్రాల పుణ్యమా అని స్కోరు 89కి చేరింది. దీంతో 244 రన్స్ తేడాతో ఓడి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఆ మాయని మచ్చ నుంచి ఇండియన్ టీమ్ బయటపడింది.
రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్:
334 పరుగుల ఛేదనలో భారత బ్యాటింగ్ లైనప్ ఇంత దారుణంగా కుప్పకూలుతుందని ఎవరూ ఊహించలేదు. భారత వన్డే చరిత్రలోనే తొలిసారి స్కోర్ బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండానే ఏకంగా 3 వికెట్ల (0/3)ని కోల్పోయింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (6/27) (Matt Henry) నిప్పులు చెరిగే బౌలింగ్ ముందు ఇండియన్ దిగ్గజాలు చేతులెత్తేశారు. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (0) (Rohit Sharma), విరాట్ కోహ్లీ (0) (Virat Kohli), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) (Shreyas Iyer) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ (5) (Ruturaj Gaikwad) కూడా అవుట్ కావడంతో 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ ఓటమిని ఖాయం చేసుకుంది. ఇది చూసిన అభిమానులకు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయి. ఇషాన్ కిషన్ (27), అక్షర్ పటేల్ (21) కాసేపు పోరాడినా కివీస్ బౌలర్ల ధాటికి భారత్ 89 పరుగులకే పరిమితమైంది.
కెప్టెన్సీ అరంగేట్రంలోనే శ్రేయస్ కు చేదు అనుభవం:
టీమిండియా వన్డే జట్టుకు తొలిసారి కెప్టెన్సీ వహించిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవాలన్న అయ్యర్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. టీమిండియా ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడవడాన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (Will Young) (108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 125 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 333 పరుగుల భారీ స్కోరు సాధించింది.
🚨 MATT HENRY'S FIVE-WICKET HAUL AGAINST INDIA 🫡🔥 - In a must-win match for New Zealand, Matt Henry delivers a sensational five-wicket haul in the 4th ODI. 🥶 #INDvsNZ #Matthenry https://t.co/P8Y6AJuQvc
— HIMANI 🐥 (@himanii_68) November 13, 2026
