Maya Lady Review: రొమాంటిక్ థ్రిల్లర్‌ ‘మాయలేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే ఖాతాలో మరో హిట్ పడిందా?

Maya Lady Review: రొమాంటిక్ థ్రిల్లర్‌ ‘మాయలేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే ఖాతాలో మరో హిట్ పడిందా?

‘ఎవరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాయలేడీ’ (Maya Lady). ప్రశంకర్ దర్శకత్వంలో మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇవాళ (నవంబర్ 13, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామెడీ, సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘మాయలేడీ’ కథేంటి? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? రాకేష్ వర్రే ఈసారి ఎలాంటి ప్రయోగం చేశారు? అనేది రివ్యూలో  తెలుసుకుందాం..

కథ:

వైజాగ్‌లో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు చెబుతుంటాడు క్రిష్ (రాకేష్ వర్రే). ఈ క్రమంలో అతడికి సోషల్ వర్కర్ ఆశ (మధుమిత సర్కార్) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఓ పబ్‌లో ఆశను చూసి షాక్ అవుతాడు. అయినప్పటికీ ఆమెతో తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత తాను ప్రేమిస్తున్న ఆశ, పబ్‌లో చూసిన అమ్మాయి ఇద్దరూ వేర్వేరని, ఆమె ఆశ చెల్లెలు రూప అని తెలుసుకుంటాడు. దీంతో ఈ ఇద్దరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆశ, రూపల గురించి ఓ విస్తుపోయే నిజం తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ నిజమేంటి? చివరకు క్రిష్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? అన్నది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే..

ఎవరికీ చెప్పొద్దు, పేక మేడలు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె.. ఈసారి కూడా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కొత్త కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇందులో చూపించిన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఇప్పటికే కొన్ని సినిమాల్లో చూపించిందే అయినప్పటికీ.. ఒక సింపుల్ లవ్ స్టోరీలో దానిని బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ప్రధానంగా తాను ప్రేమించే వ్యక్తి, తనను ప్రేమించే వ్యక్తి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీని, ఆ మూడు పాత్రల మధ్య సంఘర్షణను, ఓ కొత్త నేపథ్యంతో ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటర్వెల్ కు కథలోని మెయిన్ ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేసింది. అయితే ఎంచుకున్న కథను కన్వెన్షన్ గా చెప్పడంలో అక్కడక్కడ తడబాటు కనిపించింది. సత్య కామెడీ, మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ ను జస్టిఫై చేసే సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. 

ఎవరెలా నటించారంటే?

ఒకేలా కనిపించే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా క్రిష్ పాత్రలో రాకేష్ వర్రె ఆకట్టుకున్నాడు. ఇక మధుమిత సర్కార్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అలవోకగా నటించింది. కెరీర్ ప్రారంభంలోనే తనకు ఇలాంటి పాత్ర దక్కటం ఆమెకు మంచి అవకాశమనే చెప్పాలి. కీలక పాత్రలో ఇంద్రజ తన నటనతో ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండ్ గా కనిపించిన ప్రతి సీన్ లోనూ సత్య నవ్వించాడు. 

టెక్నీకల్ అంశాలు..

దర్శకుడు ప్రశంకర్ ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని దాన్ని లవ్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో మేళవించే ప్రయత్నం చేశారు. కథలోని ప్రధాన ట్విస్ట్‌ను ఇంటర్వెల్‌లో రివీల్ చేసిన విధానం బాగుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ గ్రిప్పింగ్‌గా ఉంది. రాకేష్ వర్రే నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా  ఉన్నాయి.

ALSO READ : వెయ్యి కోట్ల హవాలా చుట్టూ ప్రేమకథ.. ‘ఇట్లు అర్జున’ మూవీ ఎలా ఉందంటే?