వెలుగు స్పెషల్ : ఆధునిక యుద్ధానికి.. భైరవ్ బెటాలియన్లతో భారత్ సిద్ధం!

వెలుగు స్పెషల్ : ఆధునిక యుద్ధానికి.. భైరవ్ బెటాలియన్లతో  భారత్ సిద్ధం!

యుద్ధం అంటే ఒకప్పుడు సరిహద్దుల్లో సైనికుల పోరాటం, తుపాకీ కాల్పులు, ట్యాంకుల దాడులు, క్షిపణుల ప్రయోగాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ 21వ శతాబ్దంలో యుద్ధ స్వరూపం సమూలంగా మారిపోయింది. ఇప్పుడు శత్రుదేశాన్ని ఎదుర్కోవడానికి కేవలం సైనిక బలమే సరిపోదు.  డ్రోన్లు, ఉపగ్రహాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ సంకేతాలు, కృత్రిమ మేధస్సు, సైబర్  సాంకేతికతలు యుద్ధరంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. శత్రువుల సమాచార వ్యవస్థలను  గుర్తించడం, ఆయుధాల కదలికలను పసిగట్టడం, కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం ఆధునిక యుద్ధతంత్రంలో భాగమయ్యాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వార్‌‌ఫేర్, డ్రోన్ యుద్ధం,  బహుళ రంగాల సమన్వయంతో కూడిన పోరాటానికి భారత్  సిద్ధమవుతోంది. 

భారత సైనిక వ్యూహానికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఆధునిక యుద్ధతంత్రంలో ఒక కీలక పరిణామంగా నిలిచింది.  మే 7న భారత సాయుధ దళాలు పాకిస్థాన్,  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడి చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో పాక్‌‌ ప్రతిఘటనపై  భారత రక్షణ వ్యవస్థలు సమన్వయంతో స్పందించి అనేక వైమానిక ముప్పులను అడ్డుకున్నాయి. సమీకృత డ్రోన్ నిరోధక వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌‌ఫేర్ పరికరాలు, ఆకాశ్ వంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ఇందులో కీలకంగా పనిచేశాయి. ఈ ఆపరేషన్‌‌లో భారత్ చూపిన సమన్వయం, లక్ష్య నిర్ధారణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధునిక యుద్ధంలో సమాచార ఆధిపత్యం ఎంత ముఖ్యమో తెలియజేశాయి.   

సైన్యానికి కొత్త బలం భైరవ్ బెటాలియన్లు.. 

రష్యా-– ఉక్రెయిన్ యుద్ధం చిన్నపాటి డ్రోన్లు కూడా యుద్ధరంగంలో ఎంతటి ప్రభావం చూపగలవో  నిరూపిస్తోంది. నిఘా, శత్రు సైనికుల కదలికల గుర్తింపు, ఆయుధ నిల్వ కేంద్రాల పరిశీలన, లక్ష్యాలపై దాడులు వంటి పనులకు డ్రోన్లు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు ఖరీదైన యుద్ధ పరికరాలకు సవాలు విసురుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం తన పదాతిదళాన్ని ఆధునికీకరిస్తోంది. అందులో భాగంగానే  భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లను ఏర్పాటుచేస్తోంది. ఒక్కో బెటాలియన్‌‌లో సుమారు 250 నుంచి 300 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు ఉంటారు. సాధారణ పదాతిదళానికి, ప్రత్యేక దళాలకు మధ్య ఉన్న కార్యాచరణ అంతరాన్ని పూరించడం వీటి ప్రధాన ఉద్దేశం.  

చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో వేగంగా స్పందించడం, శత్రువుల కదలికలను గుర్తించడం, నిఘా నిర్వహించడం, అవసరమైనప్పుడు లక్ష్యిత చర్యలు చేపట్టడం వీటి బాధ్యతల్లో భాగం. వీటిలో పదాతిదళంతోపాటు ఆర్టిలరీ, సిగ్నల్స్, వైమానిక రక్షణ విభాగాలకు చెందిన సిబ్బందిని కూడా సమన్వయం చేస్తున్నారు. డ్రోన్ల వినియోగం, ఆధునిక సమాచార వ్యవస్థలు, అధునాతన ఆయుధాల నిర్వహణలో వీరికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. భారత సైన్యం తొలుత ఐదు బెటాలియన్లను కార్యాచరణలోకి తీసుకురాగా, మొత్తం 25 భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రకటించింది. వీటికి అనుబంధంగా పదాతిదళ బెటాలియన్లలో 'అశ్ని' పేరుతో ప్రత్యేక డ్రోన్ ప్లాటూన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా లక్ష్యాలను గుర్తించడం, అవసరమైనప్పుడు డ్రోన్ ఆధారిత చర్యలు చేపట్టడం సులభమవుతుంది.

- వనకళ్ళ వీరప్ప, జర్నలిస్ట్


ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.