కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి..మహిళ దారుణ హత్య

కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి..మహిళ దారుణ హత్య
  • జిల్లెలగూడ దత్తునగర్​లో ఘటన 
  • అపార్ట్​మెంట్​లోని అసిస్టెంట్​ప్రొఫెసరే నిందితుడు 
  • స్టాక్​మార్కెట్​లో నష్టపోయి..నగల కోసం దారుణం

మీర్​పేట్​ వెలుగు: మీర్​పేట్​పోలీస్ స్టేషన్​ పరిధిలో నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి తలపై ఐరన్​బాక్స్​తో కొట్టి ఓ మహిళను దారుణంగా చంపేశారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో  ఆ అపార్ట్​మెంట్​లో ఉండే అసిస్టెంట్​ప్రొఫెసరే నిందితుడని తేలింది. జిల్లెలగూడ దత్తునగర్​లోని శ్రీలక్ష్మి అపార్ట్​మెంట్​లో కొంత కాలంగా మిథాని ఉద్యోగి రాహుల్, తన భార్య అనిత(33), పిల్లలతో కలిసి ఉంటున్నాడు. 

బుధవారం అతడు ఉద్యోగానికి వెళ్లిపోగా, పిల్లలు స్కూల్​కు వెళ్లారు. దీంతో అనిత ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం పిల్లలు స్కూల్​నుంచి వచ్చి చూసే సరికి తల్లి రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో తండ్రికి, పోలీసులకు కాల్​చేసి దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. తలపై బలంగా కొట్టడంతో అనిత మరణించిందని తేలింది. అనిత ఒంటిపై ఉన్న బంగారు గొలును, రెండు గాజులు మాయమయ్యాయి. డోర్​బలవంతంగా ఓపెన్​చేసినట్టు కనిపించకపోవడంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. 

అసిస్టెంట్​ ప్రొఫెసరే చంపాడు..

మీర్​పేట్​పోలీసులు దర్యాప్తులో ఆ అపార్ట్​మెంట్​లో ఉండే అసిస్టెంట్​ప్రొఫెసర్​గద్దె రాజ్ కుమారే  నిందితుడని తేలింది. ప్రైవేట్​ కాలేజీలో పని చేస్తున్న అతడు స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు పెట్టి రూ.నాలుగు కోట్ల మేర నష్టపోయాడు. బయట డబ్బులు కూడా దొరక్కపోవడంతో ఫ్లాట్​లో ఒంటరిగా ఉండే అనిత కనిపించింది. ఆమె మెడలో బంగారం చూడడంతో కొట్టేస్తే కొంత ఖర్చులైనా తీరతాయని భావించాడు. 

దీంతో బుధవారం ఇంట్లో అందరూ వెళ్లిపోయాక ఆమె ఇంట్లో చొరబడి ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. తర్వాత కట్టేసి తలపై ఐరన్​బాక్స్​తో మోది చంపాడు. తర్వాత బంగారు గొలుసు, గాజులు తీసుకుని పరారయ్యాడు. సీసీ ఫుటేజీ, ఇతర టెక్నికల్​ఎవిడెన్స్​ఆధారంగా అతడిని పట్టుకున్నామని ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీర్‌‌‌‌‌‌‌‌పేట్ పీఎస్​లో వెల్లడించారు.