వాతావరణంలో వస్తున్న మార్పులు కేవలం పర్యావరణానికే కాకుండా.. మనుషుల ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న 'ఎల్‌నినో' ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కేవలం గమనించాల్సిన వాతావరణ మార్పు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి పెద్ద ముప్పు అని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 'గ్రేడ్ 3' హెచ్చరికను జారీ చేసింది.
మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని 'ఎల్‌నినో' అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేడి, వర్షపాత ప్రక్రియను పూర్తిగా మార్చేస్తుంది. కొన్ని ప్రాంతాలు కరవు, తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతుంటే.. మరికొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటాయి.
అక్టోబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2027 వరకు ఈ 'గ్రేడ్ 3' హెచ్చరిక అమల్లో ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఎల్‌నినో నేరుగా రోగాలను కలిగించకపోయినప్పటికీ.. వాతావరణ పరిస్థితులను మార్చి, వ్యాధులు ప్రబలేలా చేస్తుందని హెచ్చరించింది WHO. దీనికోసం తొలి 6 నెలలకు సుమారు 35 మిలియన్ డాలర్ల నిధులతో కార్యాచరణను సిద్ధం చేసింది.
డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ సిట్యుయేషన్ అనాలిసిస్ ప్రకారం.. ఎక్కువ హెల్త్ రిస్క్స్ ఎదుర్కొంటున్న దేశాల లిస్టులో భారత్ కూడా ఉంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ రాబోయే కాలంలో పొడి వాతావరణం, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
1. తీవ్రమైన వేడి, వడదెబ్బలు: ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇది గుండె, శ్వాసకోశ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి మరింత ప్రాణాంతకం కావచ్చు.
2. డెంగ్యూ, మలేరియా: వాతావరణ మార్పుల కారణంగా దోమల సంతతి పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వెక్టర్ ద్వారా వచ్చే వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. నీటి కొరత ఏర్పడినప్పుడు ఇళ్లలో నిల్వ చేసే నీరు దోమల వృద్ధికి కేంద్రాలుగా మారుతాయి.
3. నీటి ద్వారా వచ్చే అంటువ్యాధులు: వర్షపాతంలో మార్పులు, వరదలు, పారిశుద్ధ్య లోపాల కారణంగా తాగునీరు కలుషితమై 'లెప్టోస్పిరోసిస్' వంటి నీటి సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ప్రబలే ముప్పు పొంచి ఉంది.
4. పోషకాహార లోపం: వర్షాలు తగ్గడం వల్ల వ్యవసాయోత్పత్తి దెబ్బతిని, ఆహార లభ్యత తగ్గిపోతుంది. ఇది ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అత్యంత ప్రమాదంలో ఉన్నవారెవరు?
ఈ ఎల్‌నినో ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై ఒకేలా ఉండదు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మురికివాడల్లో నివసించే ప్రజలు, ఉపాధి కోసం ఎండలో కష్టపడే వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
