Donga Na Koduku Review: ‘లిటిల్ హార్ట్స్’ మౌళి మరో హిట్ కొట్టాడా? ‘దొంగ నా కొడుకు’ ఎలా ఉందంటే?

Donga Na Koduku Review: ‘లిటిల్ హార్ట్స్’ మౌళి మరో హిట్ కొట్టాడా? ‘దొంగ నా కొడుకు’ ఎలా ఉందంటే?

‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాబరీ, క్రైమ్, కామెడీ, లవ్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 13, 2026న) థియేటర్లలో విడుదలైంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. మరి ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? మౌళి తన కామెడీ టైమింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడా? అసలు 'దొంగ నా కొడుకు' ఎలా ఉంది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

‘దొంగ నా కొడుకు’ కథేంటంటే:

ఈశ్వర్ (మౌళి) క్రికెట్ బెట్టింగ్లు, ఆన్ లైన్ గేమ్స్తో చదువు అటకెక్కించి అప్పుల పాలవుతాడు. తన ప్రియురాలు దీపు (సుష్మిత శెట్టి) దగ్గర కూడా డబ్బు కాజేస్తుంటాడు. ఆ విషయం ఆమె ఇంట్లో తెలిసి అప్పుల భారం పెరగటంతో పాటు సమస్యలు మరింత పెరుగుతాయి. ఆవారాగా తిరిగే కొడుకుని దారిలో పెట్టడం కోసం తండ్రి (ఆలీ) గోల్డ్ షాపులో పనికి పెడితే.. అదే షాపులో రాబరీకి ప్లాన్ చేస్తాడు. అయితే అదికాస్తా బెడిసికొట్టి ఈశ్వర్ తో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్యల నుండి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు.. అసలు దొంగలను ఎలా పట్టుకున్నాడు.. దీపుతో తన ప్రేమకథ ఏమైంది.. ఇందులో అసలు విలన్ ఎవరు అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే:

క్రైమ్, కామెడీ, రాబరీ.. ఈ మూడు అంశాలను కలిపి ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అందించాలనే దర్శకుడు శ్రీను ఆలోచన బాగుంది. ముఖ్యంగా బెట్టింగ్‌లకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు.. వాటి నుంచి బయటపడేందుకు దొంగతనం చేయాలనుకోవడం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. ఈ కథలో మంచి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ట్విస్టులకు కూడా అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాలను దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో చేసే అల్లరి పనులు, బెట్టింగ్‌ల వ్యవహారం, ప్రేమకథతో కథ సరదాగా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్  నవ్విస్తాయి. మౌళి తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో అక్కడక్కడా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా అతని బాడీ లాంగ్వేజ్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అయితే కథలోకి వెళ్లే కొద్దీ కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సమయంలో వచ్చే మలుపు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

ఇక సెకండాఫ్‌లో అసలు రాబరీ వ్యవహారం మొదలవుతుంది. దొంగతనం చుట్టూ జరిగే పరిణామాలు, అనుకోని సమస్యలు, వరుస ట్విస్టులతో కథను ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉన్నప్పటికీ, వాటికి సరైన బలం లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపించలేకపోతాయి. కామెడీ కోసం పెట్టిన కొన్ని సీన్లు కూడా ఆశించిన స్థాయిలో నవ్వించవు. అక్కడక్కడా వచ్చే పంచ్ డైలాగులు, మీమ్ తరహా కామెడీ కొంత వినోదాన్ని అందించినా.. సినిమా మొత్తాన్ని ఎంగేజ్ చేసే స్థాయిలో మాత్రం లేవు.

►ALSO READ | Maya Lady Review: రొమాంటిక్ థ్రిల్లర్‌ ‘మాయలేడీ’ రివ్యూ..

మరోవైపు క్రైమ్ కామెడీ సినిమాకు ఉండాల్సిన వేగం, ఉత్కంఠ ఈ చిత్రంలో కొంత లోపించాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథను మరింత ఆసక్తికరంగా, వేగంగా నడిపించి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కొంత ఆసక్తిని కలిగించినా.. అప్పటికే నెమ్మదించిన కథనం కారణంగా ఆ ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించదు. మొత్తంగా చెప్పాలంటే.. మంచి కథా పాయింట్, మౌళి కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయి వినోదంగా మార్చడంలో ‘దొంగ నా కొడుకు’ కొంత తడబడింది. అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలు ఉన్నా.. కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

ఎవరెలా నటించారంటే?

మౌళి ఈ సినిమాకు స్పెషల్ అట్ట్రాక్షన్. ఈశ్వర్ పాత్రలో తనదైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో నవ్వించాడు. అయితే 'లిటిల్ హార్ట్స్'లో కనిపించిన ఫ్రెష్ కామెడీ ఇందులో కొంత మిస్సయింది. సుష్మిత శెట్టి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. అలీ అక్కడక్కడా నవ్వించగా, రజిత, రఘుబాబు, బబ్లూ, గుండు సుదర్శన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా నటీనటుల పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదనిపించినా, మౌళి మినహా మరే పాత్ర పెద్దగా ప్రభావం చూపించదు.

►ALSO READ | వెయ్యి కోట్ల హవాలా చుట్టూ ప్రేమకథ.. ‘ఇట్లు అర్జున’ మూవీ ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్ ఆకట్టుకుంటాయి. సింజిత్ యెర్రమిల్లి సంగీతం ఫర్వాలేదనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల హడావుడిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా సాగదీసిన సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా టెక్నికల్ టీమ్ పనితీరు ఓ మోస్తరుగా ఉంది.