ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ గుర్తింపు కార్డులు ఉన్నంత మాత్రాన ఎవరూ భారతీయ పౌరులు కాలేరని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని లేదా కుటుంబ సంబంధాలను నిరూపించడానికి కేవలం ఈ గుర్తింపు కార్డులు సరిపోవని తేల్చిచెప్పింది. ఏ ప్రాతిపదికన, ఏ పత్రాల ఆధారంగా ఆ కార్డులను జారీ చేశారనే రికార్డులను చూపించాల్సిందేనని స్పష్టం చేసింది. అస్సాంలోని దర్రాంగ్ జిల్లాకు చెందిన ఓ మహిళను విదేశీయురాలిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
అస్సాంలోని దర్రాంగ్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కోర్టులో ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి పలు పత్రాలను సమర్పించింది. అయితే ఆమె సమర్పించిన పత్రాల్లోని వివరాలకు, ఆమె కుటుంబ మూలాలకు సరైన పొంతన కుదరలేదు. పౌరసత్వాన్ని నిరూపించే బలమైన డాక్యుమెంట్లు లేకపోవడంతో ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆమెను విదేశీయురాలిగా తేల్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ గౌహతి హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. పౌరసత్వ నిరూపణపై కీలక మార్గదర్శకాలను వెలువరించింది. ఓటర్ ఫోటో ఐడెంటిటి కార్డ్, పాన్ కార్డ్ ఇతర సాధారణ గుర్తింపు కార్డులు కేవలం పౌరసత్వానికి రుజువులు కాబోవని తేల్చిచెప్పింది. ఆ కార్డులను మంజూరు చేయడానికి ప్రాతిపదికగా నిలిచిన బేస్ డాక్యుమెంట్స్ ఉంటేనే పౌరసత్వాన్ని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కేవలం గుర్తింపు కార్డులను చూపించి తాము భారతీయులమని నిరూపించుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది కోర్టు.
ALSO READ : దేశంలో డెంగ్యూ, వడదెబ్బతో జనం అల్లాడిపోతారు: ఎల్‌నినోపై WHO వార్నింగ్
న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం అస్సాంలో ఎంతో కాలంగా నడుస్తున్న పౌరసత్వ వివాదాలు, ట్రిబ్యునల్ కేసులలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరసత్వ నిరూపణ ప్రక్రియలో కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. తగిన ఆధారాలు చూపలేకపోవడంతో ఆ మహిళ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
