అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జీలకే శిక్షలు వేసిన.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత

అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జీలకే శిక్షలు వేసిన.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత

సీ.ఎస్.కర్ణన్.. మాజీ హైకోర్టు జడ్జి.. వివాదాస్పదమైన జడ్జిగా పేరు పొందారు. హైకోర్టు జడ్జిగా ఉండి ఆరు నెలలు జైలులో ఉన్నారు.. ఆ తర్వాత రిటైర్ అయ్యి.. మళ్లీ జైలుకు వెళ్లారు. ఓ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండి.. ఆయన ఇచ్చిన ఓ తీర్పు.. దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ తీర్పుతో ఆయన ఎంతో పాపులర్ అయ్యారు.. ఎంతలా అంటే కర్ణన్ అంటే.. ఆయన.. ఆ తీర్పు ఇచ్చిన వ్యక్తినా అన్నంతగా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోసహా ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు శిక్షలు విధించారు.. అది కూడా కోల్ కతా హైకోర్టు జడ్జిగా ఉండి.. కర్ణన్ అప్పట్లో ఇచ్చిన తీర్పుతో దేశం మొత్తం నివ్వెరపోయింది.. ఇప్పుడు ఆయన చనిపోయారు. తన 71 ఏళ్ల వయస్సులో చెన్నై సిటీలో కన్నుమూశారు.

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ (71) కన్నుమూశారు. చెన్నైలో నివసిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం (నవంబర్ 13) మృతి చెందారు. కర్ణన్ మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కర్ణన్ మృతిపై పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎస్. కర్ణన్ బ్యాగ్రౌండ్

వివాదస్పద న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ కర్ణన్ తమిళనాడులోని కడలూరు జిల్లా కర్ణాథం గ్రామంలో 1955లో స్వామినాథన్, కమలం దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు కరుణానిధి. 1991లో తన భార్య సరస్వతి కోరిక మేరకు కర్ణన్‌గా పేరు మార్చుకున్నారు. ఆయన 1983లో మద్రాస్ లా కాలేజీ నుంచి పట్టభద్రులై, ఆ తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.  తోటి న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుతో వరుస ఘర్షణలతో తన న్యాయ వృత్తి జీవితాన్ని గడిపిన కర్ణన్ 2009 మార్చిలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2009 మార్చిలో మద్రాస్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. 2011 మార్చిలో కర్ణన్ శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. మద్రాసు హైకోర్టులో ఆయన పదవీకాలం తోటి న్యాయమూర్తులపై కుల వివక్ష, అవినీతి ఆరోపణలు పదేపదే రావడంతో నిండిపోయింది. 2011 నవంబర్‌లో తాను దళితుడైనందున తోటి న్యాయమూర్తులు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్‌పై కూడా ఆయన ఇలాంటి ఆరోపణలే చేశారు. 2014లో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ కర్ణన్ కోర్టు గదిలోకి ప్రవేశించి హైకోర్టుకు పదోన్నతి కోసం ప్రతిపాదించిన పేర్లను వ్యతిరేకించారు.

2017లో కర్ణన్ సంచలన తీర్పు

2016లో జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్‎ఫర్ అయ్యారు. అయితే, తన బదిలీ ఉత్తర్వుపై స్టే విధించాలని ఆయన కోరడంతో ఆ బదిలీయే వివాదాస్పదమైంది. అనంతరం 2017 జనవరిలో పలువురు సుప్రీంకోర్టు సిట్టింగ్, రిటైర్డ్ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జస్టిస్ కర్ణన్ ప్రధానమంత్రికి లేఖ రాయడం అప్పట్లో దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన తర్వాత కర్ణన్‏పై సుప్రీం కోర్టు అతనిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించింది. 

2017, మే 9న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో కోర్టు ధిక్కరణ నేరానికి గాను పదవిలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి జైలు శిక్ష విధించడం ఇదే మొదటిసారి. 2017, జూన్ 12న ఆయన రిటైర్ అయ్యారు. పదవి విరమణ పొందిన నెలలోనే ఆయనను కోయంబత్తూరులో అరెస్టు చేశారు. ఆరు నెలల శిక్ష అనుభవించి 2017 డిసెంబర్‌లో కర్ణన్ జైలు నుంచి విడుదలయ్యాడు.

పొలిటికల్ ఎంట్రీ

న్యాయమూర్తిగా రిటైర్ అయ్యి.. 6 నెలల జైలు శిక్ష అనుభవించిన వచ్చిన తర్వాత 2018 మేలో కర్ణన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం న్యాయమూర్తులు, మహిళా న్యాయాధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న వీడియోల విషయంలో 2020 డిసెంబర్‌లో అతడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 2021, మార్చిలో మద్రాస్ హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.