రైలు టికెట్ బుకింగ్ లో RAC ఎత్తేస్తున్నారు.. సీరియస్ గా ఆలోచిస్తున్న రైల్వే శాఖ..!

రైలు టికెట్ బుకింగ్ లో RAC ఎత్తేస్తున్నారు.. సీరియస్ గా ఆలోచిస్తున్న రైల్వే శాఖ..!

రైళ్లలో ప్రయాణించే వారికి సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పు తీసుకురావాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఏసీ (RAC) టికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం వల్ల ప్రయాణికులకు పూర్తి బెర్త్ లభించకపోయినా, పూర్తి టికెట్ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ విధానాన్ని కొనసాగించాలా ? వద్దా ? అనే విషయంపై రైల్వే శాఖ సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఆర్ఏసీ విధానం అంటే ఏమిటి?
రైలులో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ తర్వాత ఆర్ఏసీ (Reservation Against Cancellation) టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ఏసీ టికెట్ ఉంటే ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే పూర్తి బెర్త్ మాత్రం దొరకదు. సాధారణంగా ఒకే సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తారు. దీంతో ఒక్కొక్కరికి కూర్చోవడానికి సగం స్థలం మాత్రమే లభిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. పూర్తి బెర్త్ లేకపోయినా ప్రయాణికులు మాత్రం పూర్తి టికెట్ ఛార్జీనే చెల్లించాల్సి వస్తోంది. దీనిపై చాలామంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఏసీ విధానంపై ఎందుకు అభ్యంతరాలు?
ఆర్ఏసీ టికెట్ల విషయంలో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే బెర్త్‌ను ఇద్దరు వ్యక్తులకు కేటాయించడం వల్ల ప్రయాణంలో అసౌకర్యం కలుగుతోంది. ముఖ్యంగా ఒకే సీటును పురుషుడు, మహిళకు కేటాయించినప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరికీ సౌకర్యంగా ప్రయాణం కల్పించడం రైల్వే సిబ్బందికి కూడా సవాలుగా మారుతోంది. అంతేకాకుండా, పూర్తి బెర్త్ సౌకర్యం లేకపోయినా పూర్తి ఛార్జీ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇదే విషయాన్ని లేవనెత్తిన పార్లమెంటరీ కమిటీ   
ఆర్ఏసీ టికెట్లపై ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో ప్రస్తావించింది. పూర్తి బెర్త్ సౌకర్యం పొందని ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయడం వెనుక ఉన్న కారణాన్ని కమిటీ ప్రశ్నించింది. ఈ విధానాన్ని రైల్వే శాఖ మరోసారి పరిశీలించాలని సూచించింది. ప్రయాణికులకు పూర్తి బెర్త్ లభించనప్పుడు, వారు చెల్లించే ఛార్జీల విషయంలో కూడా తగిన మార్పులు చేయాలని అభిప్రాయపడింది.

అసలు ఆర్ఏసీ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు?
గతంలో రైలు టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియ ఎక్కువగా మాన్యువల్‌గా జరిగేది. ఎవరైనా టికెట్ రద్దు చేసుకున్నా, ఏ బెర్త్ ఖాళీగా ఉందో వెంటనే తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్ఏసీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్త్‌ను కేటాయించేవారు. ఆ తర్వాత ఎవరైనా  టికెట్‌ను రద్దు చేసుకుంటే, ఆర్ఏసీ ప్రయాణికుల్లో ఒకరికి పూర్తి బెర్త్ కేటాయించే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలో టెక్నాలజీ పెరిగింది. బెర్త్‌ల ఖాళీలను ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాత ఆర్ఏసీ విధానం అవసరమా ? అనే చర్చ మొదలైంది.

ALSO READ : పాన్‌కార్డ్, ఓటర్‌ఐడీ ఉన్నా భారతీయులు కారు

ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ఏసీ విధానంపై రైల్వే శాఖ సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ విధానాన్ని రద్దు చేస్తే, రైలు టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్ఏసీ విధానాన్ని రద్దు చేస్తారా ? కొత్తగా ఎలాంటి విధానం తీసుకొస్తారు ? అనే విషయాలపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.