అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న మినీ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కోహోరా రేంజ్‌లోని హతికులి టీ ఎస్టేట్ సమీపంలో రంగజన్ వద్ద జాతీయ రహదారి (NH) 715పై శుక్రవారం (నవంబర్ 13) ఈ ప్రమాదం జరిగింది.
అధికారుల వివరాల వివరాల ప్రకారం.. 35 మందికి పైగా ప్రయాణికులతో బోకాఖాత్ నుంచి నాగావ్ వెళ్తోన్న మినీ బస్సు రంగజన్ సమీపంలో ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో పలువురు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలం భీతావహంగా మారింది.
►ALSO READ | రైలు టికెట్ బుకింగ్ లో RAC ఎత్తేస్తున్నారు.. సీరియస్ గా ఆలోచిస్తున్న రైల్వే శాఖ..!
గాయపడిన వారిని కొహోరా మోడల్ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
