జివితంలో గెలవడానికి మంచితనం సమాత్రమే ఉంటే సరిపోదు. కర్ణుడు వ్యక్తిగతంగా మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు. కానీ.. ఆయన సమయాన్ని బట్టి నడుచుకోలేదు. మంచిది కాదని తెలిసి కూడా కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజాన్ని పరిశీలిస్తూ.. సమయాన్ని బట్టి నడుచుకోవాలని కర్ణుడి పాత్ర చెప్తుంది. కౌరవ సామ్రాజ్యం మొత్తం నాశనం అవడానికి కారణం శకుని, వాళ్లతో స్నేహంగా, వాళ్ల ఆస్థానంలోనే ఉంటూ కౌరవులు కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకునిలాంటి వాళ్లు చాలామంది మన జీవితంలోకి స్నేహితులుగా వస్తూ ఉంటారు. వాళ్లని తెలివిగా దూరంగా పెట్టాలి.
అతి.. ప్రమాదకరమే!
అతి ఎప్పుడూ ప్రమాదకారే! కౌరవుల తల్లి గాంధారి తన వంద మంది కొడుకులను పెంచడానికి ఎన్నో కష్టాలు పడింది. ఎక్కువమంది బిడ్డలున్నప్పుడు ఆస్తుల్ని సమానంగా పంచటం, వాళ్ల బాగోగులు చూడటం, క్రమశిక్షణతో పెంచటం కష్టంగా మారుతుంది. దుర్యోధనుడికి కోపమెక్కువ. అతని తీవ్రమైన రాజ్యకాంక్ష వల్ల అతడితో పాటు కౌరవులంతా నాశనం అయ్యారు.
ఎవరి పనులు వాళ్లే
ఎవరి పనులు వాళ్లు చేసుకున్నప్పుడే మనతో పాటు, మనతో ఉన్న వాళ్లు కూడా సంతోషంగా ఉంటారు. మనం నేర్చుకున్న పనులు ఎక్కడో ఒక చోట ఉపయోగపడతాయి. అరణ్యవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పసులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే, మనం కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి.
పోరాడాలి
మనకు సంబంధించిన దాని కోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని పోరాటం చేశారు. విజేతలుగా నిలిచారు. సంకల్పం బలంగా ఉన్నప్పుడు శత్రువుల సంఖ్య పెద్దదైనా విజయం దక్కుతుంది.
బిడ్డలపై ప్రేమ
అతి ప్రేమ కూడా కీడు చేస్తుందని మహాభారతం మనకు కనువిప్పు కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు. కొడుకుల వినాశనం మొత్తం తనకు తెలుస్తున్నా వాళ్ల తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోకుండా వాళ్లని క్రమశిక్షణతో పెంచితే.. విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో! ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం చూపిస్తే.. వినాశనానికి దారితీస్తుంది.
నేర్చుకోవడం ఆపొద్దు
అది ఏ విద్య అయినా కావొచ్చు.. కానీ, దాన్ని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకవేళ నేర్చుకోవడం ఆపేస్తే.. ఆ రంగంలో నిపుణులు కాలేరు. అంటే, జీవితాంతం నేర్చుకోవటమే ఎవరికి వాళ్లు ఇచ్చుకునే ఉత్తమ బహుమతి! అర్జునుడు జీవితాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుడి నుంచి యుద్ధ విద్యలు, ఇంద్రుని నుంచి ఆయుధాల ప్రయోగం, మహదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు నుంచి రాజ నీతి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడి నుంచి జీవిత పాఠాలు (భగవద్గీత) ఇలా ప్రతి దశలో నేర్చుకున్నాడు. ఇదే అర్జునుడిని మహాభారతంలో హీరోను చేసింది. నిత్యం నేర్చుకోవడం వల్ల కచ్చితంగా విజయం వరిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ALSO READ : కప్పల పెళ్లి ఎలా పుట్టింది.. కప్పల పెళ్లికి.. పరువు హత్యలకు సంబంధం ఏంటో తెలుసుకోండి..!
సగమే తెలుసుకుంటే...
కొంచెం తెలిసినా.. అంతా. తెలిసినట్టు ప్రవర్తిస్తుంటారు. కొంతమంది. ఏం తెలియని వాళ్ల కన్నా.. సగం సగం తెలిసిన వాళ్లే ఎక్కువ కష్టాలు పడతారు. అర్థ జ్ఞానం చాలా ప్రమాదకరం! పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక.. తనకున్న అర్థ జ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే నేలకొరిగాడు. అందుకే, ఏ పనైనా సరే.. పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. సగం తెలుసుకుంటే దాన్ని మధ్యలోనే వదిలేయడం లేదా పరాజయంతో ముగించాల్సి వస్తుంది.
ఆసక్తి ఉంటే చాలు..
చాలామందికి తెలిసినంత వరకూ అర్జునుడే గొప్ప వీరుడు. కానీ, కుటిల రాజకీయాల వల్ల తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురువు దగ్గర శిక్షణ తీసుకోకున్నా... అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుడిగా తీర్చిదిద్దింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. మనకు మన లక్ష్యంపై అమితమైన ప్రేమ, ఆసక్తి ఉండాలి. ఇవి చాలు అనుకున్నది సాధించడానికి!
విశ్వాసం
భారతంలో లేని కథ ప్రపంచంలోనే లేదు. అలాగే, ప్రపంచంలో ఉన్న ప్రతీ కథ భారతంలో ఉంది అని అంటారు. నిజమే... మహాభారతం ప్రాచీన గ్రంథమే. అయినా.. ఇప్పుడు చదివినా జీవితానికి అవసరమైన కొత్త విషయం నేర్చుకుంటాం. భారతంలో ఉన్న ప్రతి పాత్ర మనకు ఏదో ఒక నీతిని వివరిస్తుంది. జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి అవి చాలు!
భారతంలో... జీవితపాఠం
జీవితాంతం నేర్చుకోవటమే ఎవరికి వాళ్లు ఇచ్చుకునే ఉత్తమ బహుమతి! ఒకవేళ నేర్చుకోవడం ఆపేస్తే.. ఆ రంగంలో నిపుణులు కాలేరు.
-సాయి సంకీర్త్
