నీతి కథ : కప్పల పెళ్లి ఎలా పుట్టింది.. కప్పల పెళ్లికి.. పరువు హత్యలకు సంబంధం ఏంటో తెలుసుకోండి..!

 నీతి కథ : కప్పల పెళ్లి ఎలా పుట్టింది.. కప్పల పెళ్లికి.. పరువు హత్యలకు సంబంధం ఏంటో తెలుసుకోండి..!

ఆదొక చిన్న పల్లెటూరు. అనావృష్టి, కరువు కాటకాలతో అలమటిస్తోంది. సర్పంచ్ గంగారాం ఊరి చివర రావిచెట్టు కింద.. గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ ఊరి ఆలయ పూజారి రామశర్మను వర్షాలు పడే మార్గం చెప్పమని అడిగాడు గంగారాం. కప్పలకు పెళ్లి చేయిస్తే వర్షాలు పడతాయని, అందుకు మరునాడు ఉదయం పది గంటలకు మంచి ముహూర్తం ఉందని చెప్పాడు శర్మ. పెద్దలంతా 'సరే' అని, రేపు ఉదయం కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు.

రామశర్మ కప్పల పెళ్ళి తతంగానికి కావాల్సిన సరంజామా చెప్తుంటే.. గంగారాం కాగితం మీద రాసుకుంటున్నాడు. ఇదంతా చెట్టు మీదున్న ఒక కప్ప గమనించింది. వెంటనే వాళ్ల ముందు దూకింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కప్పను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆ కప్ప ప్రాధేయ పూర్వకంగా.. ముందు కాళ్ళను జోడించి..

"పూజారి గారు.. నాదొక విన్నపం. మీరు కప్పల పెళ్లి చేయిస్తామంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఒక మండూకాన్ని ప్రేమించాను. మా అమ్మా, నాన్న గోదురు కప్పలు కాబట్టి ఒప్పుకోవడం లేదు. మనం చెట్ల మీద సైతం దుముకగలిగే కప్పలం. కానీ.. అది బురద గుంటలో నిద్రపోయే కప్ప. మన అంతస్తుకు సరిపోదు. మా పరువు తీయకని బెదిరిస్తున్నాయి. అయ్యా సర్పంచి గారు.. మీరు దయతలచి మా పెళ్లి జరిపించండి" అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంతలో మండూకం అక్కడికి వచ్చింది. అది కూడా పెద్దలను వేడుకుంది.

కప్పల వినయ, విధేయతలకు గంగారాం, రామశర్మ సంతోషించి 'మీ పెళ్లి చేయిస్తామ'ని మాటిచ్చారు. మరునాడు ఉదయం మేళ తాళాలు, పిల్లల కేరింతలు మధ్య.. ఊళ్లో పిల్లలంతా కలిసి వాటికి పెళ్లి చేయించారు. పూలమాలలు, మంగళసూత్రధారణతో అత్యంత వైభవంగా ప్రకృతిమాత ప్రసన్నమయ్యేలా.. శాస్త్రోక్తంగా కప్పల పెళ్లి జరిగింది. తర్వాత పిల్లలు వాటిని ఒక కొత్త బట్టలో పెట్టి, రోకలి అంచులకు ఉయ్యాల్లా కట్టారు. వాయిద్యాలతో ఘనంగా ఊరేగించి, తిరిగి రావిచెట్టు దగ్గర వదిలారు.

ఈ విషయం గోదురు కప్పల గుంపుకు తెలిసింది. అవి కోపంతో ఊగిపోయాయి. మన పరువు తీసిన మండూకాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ, అది వాటి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకే రావిచెట్టు కిందున్న పుట్ట దగ్గరకు వెళ్లి సర్పరాజును పిలిచాయి. సర్పరాజు పుట్టలోనుంచి బయటకు రాగానే..  "సర్పరాజా.. నువ్వే మాకు దిక్కు. మా పరువును కాపాడండి" అంటూ విషయం వివరిస్తూ.. మొర పెట్టుకున్నాయి. “ఎలాగైనా మండూకాన్నిచంపి మింగెయ్యి. దానికి ప్రతిఫలంగా మరికొన్ని కప్పల జాడ చూపిస్తాం. నీ ఆహారానికి కొరత రానియ్యం" అంటూ ఆశ చూపాయి. సర్పరాజు ఒప్పుకున్నాడు. టైం కోసం వేచి చూస్తున్నాడు.

►ALSO READ | వాస్తు : ఇంటి ముందు రేకులు వేస్తున్నారా? వాడిన నీళ్లు ఏ దిశగా వెళ్లాలి ? వాస్తు ప్రకారం ఎలా ఉండాలంటే?

కప్పల పెళ్లి జరిగి రెండు, మూడు రోజులు  గడిచినా.. కనీసం మబ్బుల జాడ కూడా కనిపించలేదు.  గంగారాం, రామశర్మ మరికొందరి పెద్దలతో మళ్ళీ అదే రావిచెట్టు కింద సమావేశమయ్యారు. కప్పల పెళ్లి ఘనంగా జరిపించినా వర్షం ఎందుకు పడడంలేదో చర్చించారు.
అప్పుడు రామశర్మ..  "మన ఊళ్ళో ఈ మధ్య పరువు హత్యలు జరుగుతున్నాయి. వాళ్ల ఉసురు మన గ్రామానికి తగిలింది. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వాళ్లను చంపించడం మహాపాపం” అని చెప్పాడు. "ఈసారికి క్షమించమని వరుణ దేవుడికి పూజలు చేస్తాను" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇదంతా నాగరాజు పుట్టలో నుంచి విన్నది. అందరూ వెళ్లాక బయటకు వచ్చింది. పాక్కుంటూ రావిచెట్టు మొదట్లోకి వెళ్ళి, పడగ ఎత్తి గోదురు కప్పలను పిలిచింది. అవన్నీ సర్పరాజు ముందుకు వచ్చాయి. "మా పరువు కాపాడినందుకు ధన్యవాదాలు సర్పరాజా..! ఇంత త్వరగా మా పంతం నెగ్గుతుందని ఊహించ లేదు" అన్నాయి గోదురు కప్పలు వినయంగా.. “నేను మండూకాన్ని చంపలేను. పరువు హత్యలు చేయడం మంచిది కాదు. ఇకనైనా బుద్ధి మార్చుకోండి. లేదంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను' అని హెచ్చరించి, రామశర్మ చెప్పిన మాటలు ఆ కప్పలకు చెప్పి వెళ్లిపోయాడు సర్పరాజు. దాంతో గోదురు కప్పలు బుద్ధి తెచ్చుకుని, మండూకాన్ని అల్లుడిగా స్వీకరించాయి. అదే రాత్రి కుంభ వృష్టి కురిసింది. ప్రజలంతా సంతోషించారు.

-చెన్నూరి సుదర్శన్, హైదరాబాద్