ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త స్కీం

ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త స్కీం

హైదరాబాద్: ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో రిక్షా కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు క్యూర్ పరిధిలో నాలుగు ప్రాంతాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది.

బండ్లగూడ (ఎల్‌ఐజీ కాలనీ), గంధంగూడ, పేట్ బషీర్బాద్, జల్‌పల్లి/లక్ష్మీగూడ ప్రాంతాల్లో మొదటి విడతలో 2వేల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణలో ఆటో ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీని 30 రూపాయలుగా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు 14 రూపాయలను ఛార్జీగా డిసైడ్ చేసింది. వెయిటింగ్ ఛార్జీలు నిమిషానికి ₹0.75 చొప్పున ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణాలకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఎక్కువ ఛార్జీ వర్తిస్తుంది.

ALSO READ : TGSRTC బంపర్ ఆఫర్.. ప్రయాణికులకు 9 రకాల భారీ రాయితీలు

ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.