హైదరాబాద్: గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం (నవంబర్ 14) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. సైబర్ టవర్స్ నుంచి HITEX, HICC వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించడంతో పాటు భారీ వాహనాలకు పూర్తిగా అనుమతి నిషేధించారు. ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాలని వాహనదారులను కోరారు.
రాహుల్ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఆవిష్కరణ
హైదరాబాద్లో గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు శనివారం (నవంబర్ 14) భారీ బైక్ ర్యాలీ, సభ నిర్వహించనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. బైక్ ర్యాలీ మాదాపూర్లోని శిల్పకళా వేదిక నుంచి ప్రారంభమై హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) / హైటెక్స్ ప్రాంతం వరకు కొనసాగుతుంది.
ర్యాలీ అనంతరం HICC వద్ద రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే గిగ్ వర్కర్లతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొని, గిగ్ వర్కర్లను ఉద్దేశించి సభలో ప్రసంగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ 2026'లో భాగంగా ఏర్పాటు చేసిన గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
