Chandrayan Review: చంద్రుడిపైకి వెళ్లాలనుకున్న పల్లెటూరి కుర్రాళ్లు.. ‘చంద్రయాన్’ సినిమా ఎలా ఉందంటే?

Chandrayan Review: చంద్రుడిపైకి వెళ్లాలనుకున్న పల్లెటూరి కుర్రాళ్లు.. ‘చంద్రయాన్’ సినిమా ఎలా ఉందంటే?

తెలుగు తెరపై ప్రేమకథలు, యాక్షన్ సినిమాలు, మాస్ మసాలా ఎంటర్‌టైనర్లు చాలానే వచ్చాయి. కానీ ఓ పల్లెటూరిలోని నలుగురు యువకులు రాకెట్ తయారుచేసి ఏకంగా చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నిస్తే? వినడానికి కొంచెం వింతగా, మరికొంచెం ఫన్నీగా అనిపిస్తోంది కదా... సరిగ్గా ఇలాంటి వెరైటీ ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘చంద్రయాన్’ (Chandrayan).

టైటిల్ వినగానే అంతరిక్ష ప్రయోగం గుర్తుకొస్తుంది. కానీ ఈ సినిమాలో అసలు ఆసక్తి అంతరిక్షంలో కాదు.. ఆ కలను కనడానికి సాహసించిన పల్లెటూరి కుర్రాళ్ల ఆలోచనల్లో ఉంది. దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో రూపొందిన ఈ ‘చంద్రయాన్’లో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. మరి శ్రీనాథ్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘చంద్రయాన్’ కథేంటి? సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.. 

కథేంటంటే?

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన నలుగురు యువకులకు ఓ అసాధారణమైన కల ఉంటుంది. ఎలాగైనా రాకెట్ తయారుచేసి చంద్రుడిపైకి వెళ్లాలని అనుకుంటారు. అయితే వారి దగ్గర శాస్త్రవేత్తలకు ఉండే సాంకేతిక పరిజ్ఞానం లేదు. పెద్ద ప్రయోగశాలలు లేవు. అందుబాటులో ఉన్న వనరులతోనే తమ లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తారు. గూగుల్‌లో వెతుకుతూ రాకెట్ తయారీకి ప్రయత్నించడం, ఇంధనం కోసం వింత ఆలోచనలు చేయడం, తమ ప్రయోగాల్లో భాగంగా కోడిని కూడా ఉపయోగించాలనుకోవడం వంటి అంశాలు కథకు వినోదాత్మకమైన నేపథ్యాన్ని అందిస్తాయి. ఈ నలుగురి ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? వారి కల నిజమైందా? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

ఆలోచన బాగుంది.. అమలులోనే అసలు పరీక్ష!

‘చంద్రయాన్’ కథలో ప్రధాన ఆకర్షణ దాని కాన్సెప్ట్. అంతరిక్ష ప్రయోగం అనే అంశాన్ని తీసుకుని దానికి గ్రామీణ వాతావరణాన్ని జోడించడం ఆసక్తికరమైన ఆలోచన. సాధారణంగా చంద్రుడు, రాకెట్, అంతరిక్షం వంటి అంశాలు వస్తే భారీ విజువల్స్, సాంకేతిక పరిజ్ఞానం, సీరియస్ కథనాన్ని ఆశిస్తాం. కానీ ఈ సినిమా మాత్రం అందుకు భిన్నంగా నలుగురు అమాయక యువకుల ప్రయత్నాల చుట్టూ వినోదాన్ని పండించాలని చూస్తుంది. ముఖ్యంగా రాకెట్ తయారీ కోసం వారు ఎంచుకునే మార్గాలు, వస్తువుల సమీకరణ, ప్రయోగాల సమయంలో ఎదురయ్యే గందరగోళం వంటి అంశాలు నవ్వులు పూయించేలా ఉంటాయి.

►ALSO READ | Prabhu Deva: తిరుమల శ్రీవారి సేవలో ప్రభుదేవా.. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం!

ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, వారి ఆలోచనలు, రాకెట్ తయారీకి చేసే ప్రయత్నాలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి. నలుగురు స్నేహితుల మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా కథకు బలంగా నిలుస్తుంది. అయితే ఒక మంచి పాయింట్‌ను పూర్తిస్థాయి సినిమాగా మలచడంలోనే దర్శకుడికి అసలు సవాలు ఎదురైనట్లు కనిపిస్తుంది. కథలో ఆసక్తికరమైన అంశాలున్నా వాటిని ఒక క్రమంలో నడిపించే స్క్రీన్‌ప్లే మరింత పటిష్టంగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనం నెమ్మదించడం, కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలిగించడం సినిమాపై ప్రభావం చూపిస్తాయి.

కామెడీ ఎలా ఉందంటే?

ఈ సినిమాకు కామెడీనే ప్రధాన బలం కావాల్సి ఉంది. నలుగురు యువకులు చేసే వింత ప్రయోగాలు, వారి అమాయకపు ఆలోచనలు, రాకెట్ తయారీలో ఎదురయ్యే సమస్యలు కొన్ని సందర్భాల్లో మంచి వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యానికి తగిన హాస్యాన్ని జోడించే ప్రయత్నం చేశారు. అయితే ప్రతి సన్నివేశం ఒకే స్థాయిలో నవ్వించదు. కొన్ని చోట్ల సహజమైన హాస్యం పండితే, మరికొన్ని సన్నివేశాల్లో కామెడీ ఆశించిన స్థాయిలో పేలదు. కథలోని మెయిన్ పాయింట్‌ను మరింత బలమైన హాస్య సన్నివేశాలతో ముందుకు తీసుకెళ్లి ఉంటే ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది.

నటీనటుల పనితీరు..

శివకుమార్ ధీకొండ, రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తమ పాత్రల్లో సహజంగా నటించారు. స్వప్న ప్రియదర్శిని, బలగం సత్యనారాయణ కూడా తమ పరిధి మేరకు మెప్పించారు. కొత్త నటీనటుల ఎంపిక కథకు మంచి ప్లస్‌.

సాంకేతిక విభాగాలు..

హర్ష ప్రవీణ్ సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. శ్రీనివాస బి. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. అయితే పుల్లారావు దాసరి ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. మొత్తం మీద సాంకేతిక విభాగాల పనితీరు ఓకే అనిపిస్తుంది.