Ramayana Collection Records: భారతీయ ఇతిహాసం రామాయణం వెండితెరపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. అయోధ్య రాముడి కథకు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రామాయణంతో శతాబ్దాల అనుబంధం ఉన్న ఆసియా దేశాల్లో ఈ సినిమాకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, నేపాల్ వంటి దేశాల్లో సరికొత్త వసూళ్ల రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలో మరో సంచలనంగా నిలిచింది.
8 రోజుల్లోనే రూ.1,033 కోట్ల వసూళ్లు
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ట్రేడ్ ట్రాకర్ Sacnilk వెల్లడించిన గణాంకాల ప్రకారం.. తొలి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,033.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో భారత్ నుంచి రూ.675.05 కోట్ల గ్రాస్ (రూ.564.60 కోట్ల నెట్) రాగా.. ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.358.50 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్త వసూళ్లలో విదేశీ మార్కెట్ల వాటా దాదాపు 35 శాతం ఉండటం విశేషం.
From Bharat to the world, the journey continues. Thank you for all the love. 🙏 Yeh Ram ke yug ka aarambh hai. 🏹 https://t.co/jX1lqk3gJ6
— The World Of Ramayana (@WorldOfRamayana) November 13, 2026
ఆసియా దేశాల్లో రామాయణానికి ఎందుకింత క్రేజ్..
రామాయణం భారతదేశానికే పరిమితమైన ఇతిహాసం కాదు. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాల్లో శతాబ్దాలుగా భాగమై ఉంది. ఇండోనేషియా, థాయ్‌లాండ్, కంబోడియా, మలేషియా వంటి దేశాల్లో రాముడు, సీత, రావణుడి కథలు స్థానిక రూపాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. అందుకే అక్కడి ప్రేక్షకులకు రామాయణం కథతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పుడు అదే ఇతిహాసాన్ని భారీ సెట్స్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించడంతో విదేశీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.
ఇండోనేషియా: 'కకావిన్ రామాయణ'కు శతాబ్దాల చరిత్ర..
ఇండోనేషియాలో రామాయణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ 'కకావిన్ రామాయణ' పేరుతో ఈ ఇతిహాసం ప్రసిద్ధి చెందగా, బాలీ ప్రాంతంలోనూ రామాయణ సంప్రదాయాలు బలంగా ఉన్నాయి. నేటికీ అక్కడి నృత్య నాటకాలు, తోలుబొమ్మల ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకల్లో రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి. ఈ చారిత్రక అనుబంధం 'రామాయణం' సినిమాకు కలిసొచ్చింది. ప్రీమియర్ల ద్వారానే సుమారు లక్ష డాలర్లు (రూ.1 కోటి) వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇండోనేషియాలో భారతీయ సినిమాకు మంచి ఓపెనింగ్ లభించినట్లయింది.
Ramayana is on track for over 1,000 showtimes across Indonesian cinemas today. For comparison, Godzilla Minus Zero opened with 2,370 showtimes and 60,182 admissions. One key difference: runtime. - Godzilla Minus Zero: 135 mins - Ramayana: 195 mins An interesting benchmark for non-Hollywood IMAX wide releases in Indonesia, especially since Ramayana runs a full hour longer.
— Cinepoint app official account (@cinepoint_) November 11, 2026
థాయ్‌లాండ్: 'రామకీన్' పేరుతో రామాయణం
థాయ్‌లాండ్‌లో రామాయణాన్ని 'రామకీన్' (Ramakien) పేరుతో పిలుస్తారు. ఇది అక్కడి జాతీయ సాహిత్య, సాంస్కృతిక సంపదలో ముఖ్యమైన భాగం. థాయ్ రాజకుటుంబ చరిత్ర, సంప్రదాయ కళారూపాలు, బ్యాంకాక్‌లోని గ్రాండ్ ప్యాలెస్ చిత్రకళలో కూడా రామకీన్ ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఈ దేశంలో రామాయణం సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం తొలి ఏడు రోజుల్లోనే సుమారు 8.5 లక్షల డాలర్ల ( దాదాపు రూ.9 కోట్ల) వసూళ్లు సాధించింది. భారతీయ ఇతిహాస కథకు అక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తికి ఇది నిదర్శనం.
కంబోడియా: 'రీమ్‌కేర్' పేరుతో రామాయణం..
కంబోడియాలో రామాయణాన్ని 'రీమ్‌కేర్' (Reamker) పేరుతో పిలుస్తారు. అక్కడి ఖ్మేర్ సాహిత్యం, సంప్రదాయ నృత్యాలు, ఆలయాల శిల్పకళలో ఈ ఇతిహాసం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత అంకోర్ వాట్ ఆలయంలోనూ రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక అనుబంధం ఉన్న కంబోడియాలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తొలి వారాంతంలోనే సుమారు 1.5 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
మలేషియా: 'హికాయత్ సెరి రామ'కు ప్రత్యేక గుర్తింపు..
మలేషియాలో రామాయణం 'హికాయత్ సెరి రామ' (Hikayat Seri Rama) పేరుతో ప్రసిద్ధి చెందింది. స్థానిక మలయ్ సాహిత్యం, సంప్రదాయ నీడబొమ్మల కళ 'వయాంగ్ కులిత్'లో రామాయణ ఘట్టాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి సాంస్కృతిక నేపథ్యం సినిమాకు కలిసొచ్చింది. దీంతో మలేషియాలో తొలి వారంలోనే సుమారు 9 లక్షల డాలర్లు (రూ.8 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడించాయి.
వియత్నాం: రికార్డుల వేటలో రామాయణం..
వియత్నాంలో సాధారణంగా భారతీయ సినిమాలకు పెద్ద మార్కెట్ ఉండదు. కానీ 'రామాయణం' మాత్రం అక్కడ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే పాత రికార్డులను అధిగమించి, ఇప్పటివరకు సుమారు 3.5 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి చారిత్రక హిందూ సంస్కృతి. ఒకప్పుడు చంపా రాజవంశ పాలనలో హిందూ సంప్రదాయాలు విస్తరించాయి. మై సన్ వంటి చారిత్రక కట్టడాలు ఆ వారసత్వానికి నిదర్శనాలు. దీంతో రామాయణ కథకు అక్కడి ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
From Bharat to the world, the journey continues. Thank you for all the love. 🙏 Yeh Ram ke yug ka aarambh hai. 🏹 https://t.co/AbbECFJ6qb
— The World Of Ramayana (@WorldOfRamayana) November 13, 2026
నేపాల్: 'బాహుబలి 2' రికార్డుకు రామాయణం గురి!
నేపాల్‌లో భారతీయ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 'రామాయణం' మాత్రం అక్కడ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీక్‌లోనే 12.80 కోట్ల నేపాల్ రూపాయలు (సుమారు రూ.8 కోట్లు) వసూలు చేసింది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' ఫుల్ రన్ కలెక్షన్లను అధిగమించింది. ఇప్పుడు 25.20 కోట్ల నేపాల్ రూపాయలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన 'బాహుబలి 2' వసూళ్లను బ్రేక్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇదే జోరు కొనసాగితే నేపాల్‌లో మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ALSO READ : ఈ రేంజ్లో ర్యాగింగ్ ఏంటి సామీ
దేశాలు మారినా.. రామాయణం పేరు, ప్రాచుర్యం ప్రత్యేకమే!
రామాయణం భారత్‌కే పరిమితమైన ఇతిహాసం కాదు. ఆసియాలోని పలు దేశాలు తమ భాష, సంస్కృతులకు అనుగుణంగా ఈ కథకు ప్రత్యేక రూపాలు కల్పించుకున్నాయి.
ఇండోనేషియా: కకావిన్ రామాయణ, బాలినీస్ రామకవచ.
థాయ్‌లాండ్: రామకీన్.
కంబోడియా: రీమ్‌కేర్.
మలేషియా: హికాయత్ సెరి రామ.
లావోస్: ఫ్రా లాక్ ఫ్రా లామ్ (Phra Lak Phra Lam).
మయన్మార్: యామా జట్‌డా (Yama Zatdaw).
ఇలా దేశాలు, భాషలు మారినా రామాయణ కథ తరతరాలుగా ఆయా ప్రాంతాల సాహిత్యం, కళలు, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
వెయ్యి కోట్ల వసూళ్ల వెనుక అసలు మ్యాజిక్ ఇదే!
రామాయణం రూ.1,000 కోట్ల మైలురాయిని అందుకోవడం వెనుక కేవలం స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మాత్రమే కాదు.. ఈ ఇతిహాసానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో తరతరాలుగా రామాయణ కథకు ఉన్న అనుబంధం సినిమాకు అంతర్జాతీయంగా కలిసొచ్చింది. దీనికి భారీ విజువల్స్, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన నిర్మాణ విలువలు తోడవడంతో విదేశీ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు పుస్తకాలు, నాటకాలు, సంప్రదాయ కళారూపాల ద్వారా ఆసియా దేశాలకు చేరిన రామాయణం.. ఇప్పుడు వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి!
Main Ram🏹 A musical tribute. Full video song out now. https://t.co/Qekv8cKwm5 https://t.co/0MzlZ4JalY
— The World Of Ramayana (@WorldOfRamayana) November 11, 2026
