Prabhu Deva: తిరుమల శ్రీవారి సేవలో ప్రభుదేవా.. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం!

Prabhu Deva: తిరుమల శ్రీవారి సేవలో ప్రభుదేవా.. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం!

వెండితెరపై తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన.. శ్రీవాణి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రభుదేవా కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ప్రభుదేవాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.

వరుస సినిమాలతో బిజీగా ప్రభుదేవా..

మరోవైపు ప్రభుదేవా సినీ కెరీర్ కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన.. పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుదేవా నటిస్తున్న తమిళ చిత్రం 'మూన్‌వాక్'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే సౌందర్య రజనీకాంత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కమల్ శ్రీదేవి' చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్‌తో కలిసి నటిస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. ఇదే కాకుండా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, అధర్వతో కలిసి ప్రభుదేవా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. వీటితో పాటు మరిన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

►ALSO READ | ‘ఆదర్శ కుటుంబం’ఎఫెక్ట్: త్రివిక్రమ్–నాగవంశీ విడిపోయారా? ఒక్క ఫోటోతో NTR మూవీపై క్లారిటీ!