హైదరాబాద్ సిటీ పబ్లిక్కు ఈసారి నీళ్ల కష్టాలు తప్పేలా లేవు. చలికాలంలోనే తాగునీటి ముప్పు ముంచుకొస్తుంది. భూగర్భ జలాల నుంచి చెరువుల వరకు.. చిన్న రిజర్వాయర్ల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నీ ఇంకిపోతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వారానికోసారి నీళ్లు వస్తుండడంతో ఎండాకాలం నాటికి ఇంకెంత గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం నెలకొంది.
మంజీరా జలాల సరఫరా నిలిపివేత ప్రతిపాదనతో సైబరాబాద్‌లో ఆందోళన నెలకొంది. సైబరాబాద్ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై నీటి సరఫరా తగ్గింపు ప్రభావం చూపే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
జనవరి 2027 నుంచి మంజీరా జలాల సరఫరాలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయన్న ప్రచారం నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) పరిధిలో మంజీరా నుంచి సైబరాబాద్‌కు అందుతున్న రోజువారీ నీటి సరఫరాలో కోత విధించే ప్రతిపాదన ఉంది. ఇదే గానీ జరిగితే.. సుమారు 3.5 లక్షలకు పైగా నీటి కనెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
సైబరాబాద్‌తో పాటు వెస్ట్ హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీళ్ల కష్టాలు తప్పేలా లేవు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మదీనాగూడ, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్చెరు, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట్ ఏరియాల్లో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలన్నింటికీ ఒకే స్థాయిలో నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పుడే చెప్పలేం గానీ మంజీరా జలాల సరఫరా తగ్గితే మాత్రం ఇబ్బందులు తప్పవు.
రాజధాని హైదరాబాద్ తాగు నీటి అవసరాలకు నాగార్జునసాగరే ఆధారం. ఆ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్తాగు అవసరాల మేరకు రోజూ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అందులో కేవలం హైదరాబాద్అవసరాలకే 1200 క్యూసెక్కులు కావడం గమనార్హం. ఎండాకాలం మొత్తం సిటీకి ఏటా 21 టీఎంసీల వరకు నీటిని తాగు అవసరాలకు విడుదల చేస్తుంటారు. సింగూరు నుంచి రావాల్సి ఉన్నా.. ఇప్పుడు అక్కడి నుంచి నీటిని తీసుకునే పరిస్థితి లేదు. రిపేర్లు చేస్తుండడంతో దానిని ఖాళీ చేశారు.
దీంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో కేవలం 2.55 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అందులోనూ డెడ్‌స్టోరేజ్‌కు పైన వాడుకునేందుకు వీలున్న నీళ్లు 1.8 టీఎంసీలే. ప్రస్తుత పరిస్థితుల్లో సిటీలోని ఇండ్లకు నీటి సరఫరాను తగ్గించేశారు. వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్తాగునీటి అవసరాల భారం మొత్తం నాగార్జునసాగర్‌పైనే పడనుంది.
