హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (నవంబర్ 13) హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనుకూల వాతావరణం, వ్యాపార అవకాశాలు ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడానికి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు.
నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించే భారత్ సమ్మిట్‌కు 70 దేశాలకు చెందిన వెయ్యి మందిని ఆహ్వానించామని తెలిపారు. అయితే, కేంద్రం పలువురు పర్యాటకులను అడ్డుకుంటోందని అన్నారు. భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించిన వారి వీసాలను కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో రద్దు చేస్తోందని ఆరోపించారు. పలువురు ప్రతినిధులు ఎయిర్ పోర్టుకు వచ్చి తిరిగి వెళ్లిపోయారని తెలిపారు.
వివిధ హోదాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులనే మేం ఈ సదస్సుకు ఆహ్వానించామని స్పష్టం చేశారు. బీజేపీ ఓ నియంతలా వ్యవహరిస్తూ ఈ సమ్మిట్‌కు వచ్చే వారిని అడ్డుకుంటుందన్నారు. బీజేపీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ సదస్సు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయని.. ఈ రెండు పార్టీలు ఒకే విధివిధానాలతో మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేసీఆర్ భారత్ సమ్మిట్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం చేపట్టిన బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడబల్కోన్ని అడ్డుతగులుతున్నాయని ఫైర్ అయ్యారు.
భారత్ సమ్మిట్‌ను గుడ్డిగా వ్యతిరేకించొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. భారత్ సమ్మిట్‌ను బీజేపీ భారత వ్యతిరేక సమ్మిట్ అని విమర్శించడంపై రేవంత్ మండిపడ్డారు. పలుదేశాల వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే భారత్ సమ్మిట్ యాంటి నేషనల్ సమ్మిట్ ఎలా అవుతోందని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు వ్యాఖ్యలు తెలంగాణకు తీరని నష్టమని పేర్కొన్నారు.
భారత్ సమ్మిట్ చివరి రోజు (నవంబర్ 14) రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. గిగ్ వర్కర్లతో ఆయన మాట్లాడుతారని చెప్పారు. రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భయమని.. అందుకే ఆయన చేసే ప్రతిపనిని ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. రాహుల్‌ను బీజేపీ విమర్శించిన ఆయన విలువ ఏ మాత్రం తగ్గదన్నారు.
రాహుల్ గాంధీని రీ లాంఛ్ చేయాల్సిన అవసరం లేదని.. ఆయన సత్తా ఏంటో దేశ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ నేతలు గందరగోళంలో మాట్లాడుతున్నారని విమర్శించారు. 140 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఆత్మను రిప్రజెంట్ చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు భారత్ సమ్మిట్‌పై విమర్శలు మానుకోవాలని సూచించారు.
