త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లోజ్.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయ్: సీఎం రేవంత్

త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లోజ్.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయ్: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (నవంబర్ 13) హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగుస్తోందని చెప్పారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 

ఇక, తన ఫోన్‎ను ఎవరైనా ట్యాప్ చేసిన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. నా ఫోన్‎లో ఏదైనా మీరు వినొచ్చని అన్నారు. సీఎం వ్యాఖ్యలతో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు వంటి వారు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వెల్లడి కాబోతున్నాయని పొలిటికల్ కారిడార్లలో రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా పలువురు ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జడ్జిలు, సెలబ్రెటీల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు మార్చి 2024లో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ పలువురు నిందితులు, సాక్ష్యులను విచారించింది. 

►ALSO READ | రాహుల్ అంటే బీజేపీకి భయం.. భారత్ సమ్మిట్‎ను ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నయ్: సీఎం

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వంటి వారిని సాక్ష్యలుగా ఇన్విస్టిగేషన్ చేసింది. విచారణలో భాగంగా పలువురిని విచారించిన సిట్ తుది చార్జిషీట్ సిద్ధం చేసింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వంటి సీనియర్ పోలీసు అధికారులను గతంలోనే అరెస్ట్ చేశారు. తదనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. విచారణలో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులను విచారించిన సిట్ తుది చార్జిషీట్ సిద్ధం చేశారు.