వాషింగ్టన్: అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియాకు 33 ఏళ్లపాటు నాయకత్వం వహించిన జెన్సెన్ హువాంగ్ తన సీఈవో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చైనా స్పైగా ఆరోపణలు ఉన్న ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలిగారు. దీంతో CFO కొలెట్ క్రెస్ ఎన్విడియా తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. జెన్సెన్ హువాంగ్ నిష్ర్కమణతో ఆయన స్థానంలో కొత్త సీఈవో కోసం ఎన్విడియా అన్వేషణ మొదలుపెట్టింది.
సంస్థతో పాటు బయట వ్యక్తులను కూడా సీఈవో పదవి కోసం పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన ముగ్గురు టెక్ దిగ్గజాల పేర్లు ఎన్విడియా సీఈవో రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్. వీరూ ముగ్గురి పేర్లు ఎన్విడియా తదుపరి సీఈవో రేసులో ముందు వరుసలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
సంజయ్ మెహ్రోత్రా
సెమీకండక్టర్, మెమరీ చిప్ పరిశ్రమలో టెక్ దిగ్గజం సంజయ్ మెహ్రోత్రాకు దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో శాన్‌డిస్క్ సహ-వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. తన శక్తి సామర్ధ్యాలతో మైక్రాన్ టెక్నాలజీని సమర్థవంతంగా నడిపిస్తూ చిప్ తయారీ రంగంలో కీలక నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ చిప్ కంపెనీ దిగ్గజం ఎన్విడియా సీఈవో రేసులో సంజయ్ పేరు ముందు వరుసలో ఉంది.
నికేష్ అరోరా
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు చైర్మన్ అండ్ సీఈఓగా నికేష్ అరోరా వ్యవహరిస్తున్నారు. గతంలో టెక్ దిగ్గజం గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేశారు నికేష్. అలాగే, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌లో ప్రెసిడెంట్‌గా పనిచేసిన వ్యాపార నిర్వహణ అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఎన్విడియా సీఈవో రేసులో నికేష్ ఆరోరా పేరు కూడా వినిపిస్తోంది.
►ALSO READ | ఎన్విడియో మాజీ సీఈవోకు మూడో ఎఫైర్ ఉందంట.. ఇంకెంత మంది ఉన్నారయ్యా!
థామస్ కురియన్
కేరళకు చెందిన థామస్ కురియన్ ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2019లో గూగుల్ క్లౌడ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, ఏఐ సేవలలో ఆయనకున్న అనుభవం ఎన్విడియా భవిష్యత్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్విడియా సీఈవో పోటీలో థామస్ కురియన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
