అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌కు రానున్నారు. రేపు(శనివారం, నవంబర్ 14) హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన సిటీకి వస్తున్నారు. శిల్ప కళా వేదిక నుంచి హెచ్‌ఐసీసీ వరకు ఈ ర్యాలీ జరగనుంది.

రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో నేరుగా మాట్లాడనున్నారు. భారత్ జోడో యాత్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫామ్ వర్కర్స్ యాక్ట్–2026’ను, సంక్షేమ పథకాలను ఈ సభా వేదికపై రాహుల్ అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ చట్టంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, డిజిటల్ సేవల కార్మికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ చట్టబద్ధమవుతాయి. ప్రత్యేక సంక్షేమ బోర్డుతో పాటు కార్మికుల నమోదు, ఫిర్యాదుల కోసం రూపొందించిన మొబైల్ యాప్‌‌‌‌ను కూడా ఆవిష్కరిస్తారు. 

ప్రభుత్వ నిర్ణయాలపై టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గిగ్ కార్మికుడికి గౌరవం, సామాజిక భద్రత కల్పించడమే తమ ఉద్యమ లక్ష్యమన్నారు.