కేసీఆర్‌కు సోనియా గాంధీ పుస్తకం పంపిస్తా.. 80,001వ పుస్తకం చదివినట్లవుతుంది: మహేష్ కుమార్ గౌడ్

కేసీఆర్‌కు సోనియా గాంధీ పుస్తకం పంపిస్తా.. 80,001వ పుస్తకం చదివినట్లవుతుంది: మహేష్ కుమార్ గౌడ్

సోనియా గాంధీ పుస్తకంపై కూడా టీపీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా పంపిస్తానని తెలిపారు. కేసీఆర్‌కు ఈ పుస్తకం పంపితే ఆయన 80,001వ పుస్తకం చదివినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఈ పుస్తకాన్ని అడుగుతున్నారని వెల్లడించారు.

రాహుల్ గాంధీ వెంట తాను పరుగులు తీయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాము ఫిట్‌గా ఉన్నామని, అందుకే రాహుల్ గాంధీతో కలిసి పరుగులు తీశామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వెంట పరిగెత్తడం, ఆయన చేయి పట్టుకుని నడవడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. "మా నాయకుడితో పరుగులు తీస్తే మాకేం నష్టం లేదు. నేనే కాదు.. దేశం మొత్తం రాహుల్ గాంధీ మత్తులో ఉంది. మేము ఫిట్‌గా ఉన్నాం కాబట్టే పరుగులు తీశాం. పైగా నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా. ఫిట్‌గా ఉండి రన్నింగ్ చేస్తే ట్రోల్ చేయడం ఎందుకు?" అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ వెంట పరుగులు తీయడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయన చేయి పట్టుకుని నడవడం కూడా తనకు అదృష్టమన్నారు. అక్కడ జరిగిన తోపులాటలో తన బైక్ కింద పడిందని, అందుకే పరుగెత్తాల్సి వచ్చిందని వివరించారు.

గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ పోరాటం

రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సామాన్య ప్రజలు, గిగ్ వర్కర్ల సమస్యలపై పోరాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. గిగ్ వర్కర్ల కోసం బిల్లు తీసుకొచ్చే వరకు వారి సమస్యలపై రాహుల్ గాంధీ వెంటపడ్డారని పేర్కొన్నారు.సోనియా గాంధీ పుస్తకంపై రాహుల్ గాంధీ కూడా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. త్వరలోనే ఈ పుస్తకం తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాబోతోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.