టిప్, యాడ్-ఆన్ పేరుతో ఓలా కొత్త దందా.. రూ.10 లక్షల జరిమానా..

టిప్, యాడ్-ఆన్ పేరుతో ఓలా కొత్త దందా..  రూ.10 లక్షల జరిమానా..

ఓలా  బైక్ రైడ్  బుక్ చేసుకునే ముందే కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసే విధానాన్ని అనుసరించినందుకు ఓలాకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ  (CCPA) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఓలా యాప్‌లో రైడ్ బుక్ చేసుకునే సమయంలో డ్రైవర్ కోసం వెతుకుతున్నప్పుడు  ‘టిప్’ పేరుతో అదనంగా డబ్బులు చెల్లించేటట్టు ఉండేది. ఇలా టిప్ ఇస్తే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉంటుందని యాప్‌లో మెసేజులు చూపించేది.

దీనిపై విచారణ చేపట్టిన CCPA.. ఈ విధానం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని గుర్తించింది.  ‘టిప్’ పేరుతో అదనంగా డబ్బులు చెల్లిస్తే త్వరగా రైడ్ వస్తుందనే అభిప్రాయం కలిగించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఓలాను ఆదేశించింది. అయితే, ఓలా తర్వాత ‘టిప్’ పేరును ‘యాడ్-ఆన్’గా మార్చింది. కానీ అదనంగా డబ్బులు చెల్లించే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

ఓలా యాప్‌లోని వివిధ వెర్షన్లను పరిశీలించిన CCPA.. కొన్ని మెసేజులు  గుర్తించింది. “టిప్ ఇస్తే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉంది”, “త్వరగా రైడ్ పొందాలంటే ఇప్పుడే టిప్ ఇవ్వండి” అనే అర్థం వచ్చేలా యాప్‌లో మెసేజ్‌లు చూపించేవారు. ఇవి వినియోగదారులను అదనంగా డబ్బులు చెల్లించేలా ప్రేరేపిస్తున్నాయని CCPA అభిప్రాయపడింది.

అంతేకాదు, ఈ అదనపు చెల్లింపులు రైడ్ త్వరగా దొరకడానికి నిజంగా ఉపయోగపడతాయా లేదా అనే విషయాన్ని కూడా ఓలా స్పష్టంగా చెప్పలేదు. యాడ్-ఆన్ చెల్లించినప్పటికీ రైడ్ త్వరగా దొరుకుతుందని ఎలాంటి హామీ లేదనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయలేదు.

మరోవైపు, యాడ్-ఆన్ పేమెంట్స్.. రైడ్ కేటాయింపుపై ఎలాంటి ప్రభావం చూపవని ఓలా చెబుతోంది. కానీ, అదనంగా డబ్బులు చెల్లిస్తే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉందని యాప్‌లో మెసేజ్ చూపించడం కంపెనీ వైఖరిలో విరుద్ధంగా ఉందని CCPA పేర్కొంది.

అలాగే, ఈ ఎక్స్ట్రా  పేమెంట్  కోసం నిర్దిష్ట మొత్తాలను ఎందుకు సూచిస్తున్నారు ? వాటిని ఎలా నిర్ణయిస్తున్నారు ? అనే విషయాలను కూడా వినియోగదారులకు వివరించలేదు.

ALSO READ : అక్టోబర్‌లో పెరిగిన డిజిటల్ ద్రవ్యోల్బణం..

సాధారణంగా టిప్ అంటే సర్వీస్ పూర్తయిన తర్వాత, కస్టమర్ తన ఇష్టంతో ఇచ్చే ఎక్స్ట్రా డబ్బు. కానీ ఓలా మాత్రం రైడ్ స్టార్ట్  కాకముందే టిప్ అడగడం ద్వారా దాని అసలు ఉద్దేశాన్ని మార్చేసిందని CCPA అభిప్రాయపడింది. కేవలం ‘టిప్’ అనే పేరును ‘యాడ్-ఆన్’గా మార్చినంత మాత్రాన ఈ విధానం సరైనదిగా మారదని స్పష్టం చేసింది.

ఈ విధానం వినియోగదారుల హక్కులకు విరుద్ధంగా ఉందని, వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లేనని CCPA తేల్చింది. దీంతో ఓలాకు రూ.10 లక్షల జరిమానా విధించడంతో పాటు, ఈ విధానాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించింది.