Mahadev Online Book App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కాం.. సీబీఐ మెరుపు దాడులు.. 6 రాష్ట్రాల్లో 33 చోట్ల సోదాలు

Mahadev Online Book App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కాం.. సీబీఐ మెరుపు దాడులు.. 6 రాష్ట్రాల్లో 33 చోట్ల సోదాలు

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం(నవంబర్14) ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, హవాలా లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే..

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ (Mahadev Online Book App) కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించింది.  ఈ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ విచారణలో వెల్లడించిన సమాచారం ఆధారంగా  ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మ్యూల్ బ్యాంక్ ఖాతాలు (Mule bank accounts) ,హవాలా ఛానెల్స్‌కు సంబంధించిన కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పలు చోట్ల అక్రమంగా కొనసాగుతున్న లైవ్ బెట్టింగ్, జూదం ప్యానెల్స్‌ను గుర్తించి వాటిని అధికారులు నిలిపివేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ను  నవంబర్ 1న సీబీఐ అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం రాయ్‌పూర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది. నవంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసును ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేయగా, ఇప్పటివరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఫ్రాంచైజీల ద్వారా క్రికెట్, ఫుట్‌బాల్, కార్డ్ గేమ్స్‌పై అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.