అమెరికాలో ఏం జరుగుతుంది.. 9/11 తర్వాత.. అదే తరహాలో విమానాలు గ్రౌండ్ జీరో !

అమెరికాలో ఏం జరుగుతుంది.. 9/11 తర్వాత.. అదే తరహాలో విమానాలు గ్రౌండ్ జీరో !

అమెరికాలో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 9/11 తర్వాత ఇదే రెండోసారి కావడం గమనార్హం. అమెరికా అంతటా విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. టెలికమ్యూనికేషన్స్ సమస్య కారణంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో సమస్య తలెత్తింది. దీనివల్ల దాదాపు 7,000 విమానాలపై ప్రభావం పడింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇలా విమానాలను నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

అమెరికా విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్న సమయంలో అప్పటికే 4 వేలకు పైగా విమానాలు గగనతలంలో ఉన్నాయి. అయితే.. అమెరికా దేశవ్యాప్త విమాన సర్వీసుల నిలిపివేత నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ చెప్పడంతో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్త విమాన సర్వీసుల నిలిపివేతను ఎత్తివేసింది. దీంతో.. యథావిధిగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 

అమెరికాలో భారీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం (నవంబర్ 13, 2026) ఏర్పడిన ఈ సమస్య కారణంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ విధించింది. దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు కొనసాగిన అంతరాయం తర్వాత ఆంక్షలను ఎత్తివేసి విమానాల రాకపోకలకు అనుమతించింది. అయితే విమానాల రద్దు, ఆలస్యాలు, దారి మళ్లింపుల ప్రభావం వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు FAA వెల్లడించింది. పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు అధిక డేటా లోడ్‌ను తట్టుకోలేకపోవడం వల్ల సమస్య ఏర్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కొత్త టెక్నాలజీ, పాత పరికరాల మధ్య అనుకూలత సమస్యల పైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక సైబర్ దాడి ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ అంతరాయం అమెరికా విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం దాదాపు 5 వేల విమానాలు రద్దయ్యాయి. మరో 827 విమానాలను దారి మళ్లించారు. 15 లక్షలకు పైగా ప్రయాణికులపై ప్రభావం పడింది. యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, జెట్‌బ్లూ వంటి సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

ఇప్పటికే గాల్లో ఉన్న విమానాల్లో చాలా వరకు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అనుమతించగా, కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ FAA చర్యలు చేపట్టింది. గ్రౌండ్ స్టాప్ ఎత్తివేసినా విమానాల షెడ్యూళ్లు వెంటనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని, ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు.