వృద్ధులు, దివ్యాంగులకు పరికరాల పంపిణీ ..లబ్ధిదారుల ఎంపిక కోసం నవంబర్ 16 నుంచి మెగా క్యాంపులు

వృద్ధులు, దివ్యాంగులకు పరికరాల పంపిణీ ..లబ్ధిదారుల ఎంపిక కోసం నవంబర్ 16 నుంచి మెగా క్యాంపులు
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆలింకో ఆధ్వర్యంలో శిబిరాలు

హుస్నాబాద్, వెలుగు: వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆలింకో ముందుకొచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రాష్ట్రంలో ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఈ నెల 16 నుంచి మెగా ఎంపిక క్యాంపులు నిర్వహించనుంది. ఏడు మండలాలతో పాటు హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ విడతల వారీగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 16న సైదాపూర్ మండలంలో, 17న ఎల్కతుర్తి, 18న అక్కన్నపేట, 19న భీమదేవరపల్లి, 20న కోహెడ, 21న చిగురుమామిడి మండలాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. 25న హుస్నాబాద్ మండలంలో, 26న హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే శిబిరాల్లో అర్హులను గుర్తిస్తారు. వయోభారంతో నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, వీల్‌‌‌‌చైర్లు, వినికిడి యంత్రాలు, చంకకర్రలు, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలు అందజేస్తారు. 

సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి పొన్నం

నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, ఆలింకో శిబిరాలను వృద్ధులు, దివ్యాంగులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శిబిరాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆఫీసర్లను ఇప్పటికే ఆదేశించినట్టు చెప్పారు.