ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు

ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం
  • డ్రైవింగ్ శిక్షణలో వెళ్తుండగా ప్రమాదం
  • చేవెళ్ల మండలంలో కారును తప్పించబోయి పల్టీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ గేటు సమీపంలో ఆర్మీ వాహనం పల్టీ కొట్టింది.  ఈ ఘటనలో వ్యాన్​లోని 14 మంది గాయపడ్డారు. డ్రైవర్​ పరిస్థితి విషమంగా ఉంది. జవాన్లు శుక్రవారం హైదారాబాద్​ గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి శిక్షణ కోసం షాబాద్‌‌‌‌‌‌‌‌ వెళ్తున్నారు.

చేవెళ్ల మండలం అల్లావాడ గేటు వద్ద ఎదురుగా కారును తప్పించబోయి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లకు స్వల్ప గాయాలు కాగా, డ్రైవింగ్ శిక్షణలో ఉన్న హవల్దార్ అవిందర్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిలో మల్లప్ప, విశ్వనాథ్, రాజీవ్, అర్జుప్ప, జీవన్, జీత్వాస్ పరాస్, అశ్విన్, నుద్దీమ్​, సూరజ్ తదితరులు ఉన్నారు. పోలీసులు గాయపడిన వారిని శంషాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్​దవాఖానకు అక్కడి నుంచి గోల్కొండలోని ఆర్మీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం జవాన్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.